ACB Raids in Vemulawada Temple : భక్తులకు కొంగు బంగారమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో రికార్డులను పరిశీలించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు స్టాక్ రిజిస్టర్లలో తప్పిదాలను గుర్తించారు. నెయ్యి, జీడిపప్పు, నూనెకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నాయని తేల్చారు. ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తించారు.
తలనీలాలు సమర్పించే ఒక్కో భక్తుని నుంచి రూ.50, 100 చొప్పున వసూలు చేస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని నిర్ధరించారు. కొత్త టెండర్ల విధానానికి దేవదాయశాఖ ఆమోదం లేకుండానే పాత టెండర్ల ద్వారానే వస్తుసామాగ్రి కొనుగోలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
అన్న సత్రం, కోడెల నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు కేటాయించిన గదులు, వీఐపీల దర్శనాల వివరాలను పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కల్యాణం జరిపించే భక్తులకు ఇచ్చే ప్రసాద వితరణ, దాతల వివరాలు, సెక్యూరిటీ కోసం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలనూ సేకరిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. అనుబంధ ఆలయాల నిర్వహణ పేరిట వెచ్చిస్తున్న నిధులపైనా ఏసీబీ అధికారులు వివరాలు సేకరించారు.
రాష్ట్రంలో దూకుడు పెంచిన ఏసీబీ - పట్టుబడుతున్న అవినీతి అధికారులు - Prathidhwani on ACB Raids