ACB Caught Rangareddy Joint Collector Bribe News : రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒకవైపు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ, మరోవైపు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమాలను బయటపెడతూ వరుస దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏసీబీ వలకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి చిక్కారు. జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ, ట్రాప్ చేసి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకుంది. ఈ మేరకు వారిని అధికారులు అరెస్టు చేశారు.
ధరణి నిషేధిత జాబితా లోంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు బాధితుడి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్‌రెడ్డి బాధితుడి నుంచి కారులో డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకే తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడికక్కడే నిందితుడితో జాయింట్ కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు ఫోన్ చేయించగా పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్దకు తీసుకురావాలని వెల్లడించారు. మదన్ మోహన్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా జాయింట్ కలెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో నాగోల్‌లోని జాయింట్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రూ.16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీకి చిక్కడం ఖాయం : అవినీతి అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సి.వి.ఆనంద్ పేర్కొన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీకి చిక్కడం ఖాయమని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, మరో ఉద్యోగి ఘటనే ఇందుకు నిదర్శనం చెప్పారు. ఈ మేరకు ఆయన అధికారుల అవినీతిపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇద్దరిని పట్టుకోవడంలో ఏసీబీ బృందం చాకచక్యంగా పనిచేసిందని కొనియాడారు. ఇద్దరి నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.