Nagarjuna Sagar Dam Flood Water Level : నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం, సుంకేశుల నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ గేట్లను 22 నుంచి ఉదయం 20 తగ్గించగా, మళ్లీ ఇప్పడు మరొక రెండు గేట్లను దించి 18 క్రస్ట్ గేట్లతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయంకు ఇన్ ఫ్లో 2,95,919 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఔట్ ఫ్లో కూడా అంతే మొత్తంలో కొనసాగుతుంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 584.40 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 295 టీఎంసీలకు చేరుకుంది. 18 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,50,000 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar Dam Tour :మరోవైపు రెండేళ్ల తర్వాత మళ్లీ సోమవారం ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకులు సందడి కొనసాగుతోంది. సాగర్ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ పరవశిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, ఫ్రెండ్స్‌తో మరికొందరు ఇలా సాగర్ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్నారు.