Nitish Kumar Reddy BGT 2024 :బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే అది తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి. ఆసీస్ పిచ్‌లపై సీనియర్లే బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటే మనోడు మాత్రం తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో 50+ సగటుతో 163 పరుగులు చేశాడు. అటు బంతితోనూ రాణిస్తూ 2 వికెట్లు పడగొట్టి మాజీల ప్రశంసలు అందుకుంటున్నాడు.
7 నెలల్లోనే
2024 ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు నితీశ్. దీంతో 7 నెలల్లోనే అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆడుతున్నది తొలి టెస్టు సిరీస్. అదీనూ ఆసీస్ గడ్డపై. అయినప్పటికీ ఎలాంటి భయం లేకుండా బుల్లెట్‌లాంటి బంతులను ఎదుర్కొంటూ క్రీజులో స్పేచ్ఛగా ఆడుతున్నాడు.
ఈ సిరీస్‌లో నితీశ్ ఇన్నింగ్స్ ఎంతో విలువైంది. తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించాడు. ఆరో స్థానంలో వచ్చిన నితీశ్ ఆఖరి వరకూ క్రీజులో నిలిచి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 150 పరుగులకు చేరగలిగింది. ఆ తర్వాత బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని 104 పరుగులకు కట్టడి చేయడం వల్ల భారత్ విజయం ఖాయమైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
డే/నైట్ టెస్టులో ఇలా
కెరీర్లో తొలిసారి డే/నైట్ టెస్టు ఆడిన నితీశ్ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టాప్ స్కోరర్ నితీశే. తొలి ఇన్నింగ్స్‌లో సీనియర్ బ్యాటర్లు ఇబ్బందిపడిన వేళ విలువైన ఇన్నింగ్స్ (42 పరుగులు) ఆడాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో అప్పటికే భారత్ ఓటమి ఖాయమైనా, ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 42 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాడు.