Hair Loss Remedies at Home: తలపై ఒత్తుగా ఉన్న జుట్టు కొంచె కొంచెంగా రాలిపోతుంటే ఎవరికైనా ఆందోళనగానే ఉంటుంది. అందుకే ఈ సమస్యను అరికట్టేందుకు సబ్బులు, షాంపులు మార్చడం మొదలుకుని చిట్కా వైద్యం వరకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి జుట్టు రాలడం వెనుక పోషకాహార లోపాలతో పాటు రక్తహీనత, కాలుష్యం ఇలా చాలా కారణాలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడే కారణాన్ని పసిగట్టి దానికి చికిత్స తీసుకుంటే జుట్టు రాలడాన్ని చక్కగా అరికట్టవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"ప్రతి రోజు తల దువ్వుకునేటప్పుడు, తల స్నానం, నూనె పెట్టుకునేటప్పుడు సుమారు 50 వెంట్రుకలు రాలడం సహజమే. ఇంతకు మించి రాలితే శ్రద్ధ వహించాలి. ఇందుకు మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి శరీరంలో ప్రకోపించే పిత్తదోషాలు, తీవ్రమైన వేడి, ఒత్తిడి, ఆందోళన ఇలా చాలా కారణాలే ఉంటాయి. ఇంకా కొంతమందికి సీజన్ వల్ల కూడా రాలిపోతుంటాయి. జుట్టు రాలకుండా ఉండాలంటే కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. జుట్టు పెరగడానికి సాయం చేస్తాయి. ఇంకా గుడ్డులో కూడా జుట్టును కాపాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. బ్రొకోలీ, అవకాడో, సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు తినాలి."
--డాక్టర్ పెద్ది రమాదేవి, ఆయుర్వేద ఫిజీషియన్

కోడి గుడ్డు, అరటి పండు, పెరుగు, ఆలివ్ నూనె, నిమ్మరసం వీటన్నింటిని కలిపి జుట్టుకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందని డాక్టర్ రమాదేవి తెలిపారు. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు, సగం అరటి పండు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఆలివ్ నూనె కలిపి ఇందులోనే విటమిన్ ఈ మాత్ర వేసి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలని అంటున్నారు. అనంతరం షాంపూతో తల స్నానం చేసి ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పెట్టి 15 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

దీంతో పాటు మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, త్రిఫల చూర్ణం ప్రతి రోజు అర చెంచా చొప్పున తీసుకుంటే జుట్టు రాలకుండా ఉండేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇందులో జుట్టును రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. దీనిని నెయ్యి, బెల్లంతో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంకా అర చెంచా భృంగరాజు, గోక్షూర, త్రిఫలాలు సమానంగా కలిపి తేనెతో తీసుకుంటే ఉదయం, సాయంత్రం 45 రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. అన్నింటి కన్నా ముందుగా ఏ కారణం వల్ల జుట్టు రాలిపోతుందనేది తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పీసీఓడీ, ధైరాయిడ్ ఇలా కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు తలస్నానం నుంచి దువ్వుకునే వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలని.. వారానికి రెండు సార్లు తల స్నానం చేయాలని సలహా ఇస్తున్నారు. పొడి జుట్టు ఉన్నప్పుడు తల స్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిదని అంటున్నారు. ఇంకా ఆహారంలో జింక్, బయోటిన్ పోషకాలు లభించే వాటిని తీసుకోవాలని తెలిపారు. తలను పదే పదే దువ్వుడం, తరచూ హెయిర్ డ్రయర్లు వాడకూడదని పేర్కొన్నారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలని.. చుండ్రు, పేలు కొరకడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
త్వరగా అలసిపోతున్నారా? ఇవి తింటే ఫుల్ ఎనర్జీతో ఉంటారట! అవేంటో తెలుసా?
ఇంట్లో పెరుగు మిగిలిపోయిందా? పడేయకుండా ఈ వంటల్లో వాడితే సూపర్ టేస్ట్!