WPL 2024 Heather Knight : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే - జట్టు నిండా స్టార్ ప్లేయర్లున్నప్పటికీ గత సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసి విమర్శలు అందుకున్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(మహిళల జట్టు). స్మృతి మంధాన సారథ్యంలోని ఈ జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఉన్న ఇంగ్లాండ్ సారథి హీథర్ నైట్ ఈ సీజన్‌కు దూరమైంది. ఈ విషయాన్ని ఆర్సీబీ తమ సోషల్ మీడియా ఖాతాలో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. నైట్ స్థానంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ నదైన్ డె క్లర్క్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే హీథర్ నైట్ ఈ సీజన్ నుంచి ఎందుకు తప్పుకుందో సరైన కారణాన్ని ఛాలెంజర్స్ జట్టు క్లారిటీ ఇవ్వలేదు.
అదే కారణమా :మార్చిలో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. మార్చి 19 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొననుంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 17 వరకూ జరగనుంది. అంటే కివీస్‌తో సిరీస్ మొదలయ్యే నాటికి డబ్ల్యూపీఎల్ పూర్తవుతుంది. అయినా ఇంగ్లాండ్ బోర్డు మాత్రం తమ ఆటగాళ్లను ఈ లీగ్‌లో ఆడించే విషయమై ఇంకా తర్జనభర్జన పడుతూనే ఉంది. పైగా ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్ కోసం తమ ఆటగాళ్లు ఫ్రెష్‌గా ఉండేలా చూస్తోందని అర్థమవుతోంది. డబ్ల్యూపీఎల్‌లో పాల్గొని గాయాల బారిన పడటం, మానసికంగా అలిసిపోవడం వంటివి జరగకుండా ఉండేందుకే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ ఆటగాళ్లను డబ్ల్యూపీఎల్ నుంచి తప్పుకోవాలని సూచించినట్టు ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి.