Is Dhoni Joining Politics : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉండే క్రేజే వేరు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నప్పటికీ ధోనీకి భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. మిస్టర్ కూల్ సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచ, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మూడు కప్పుల్ని సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం గమనార్హం. అయితే తాజాగా మహీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకి అందులో నిజమెంత? ధోనీ పొలిటికల్ ఎంట్రీ కన్ఫార్మ్ ఏనా? తెలుసుకుందాం.
రాజీవ్ శుక్లా క్లారిటీ!
ధోనీ రాజకీయాల్లోకి రానున్నారని గతంలోనూ చాలా సార్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ధోనీ పొలిటికల్ ఎంట్రీపై ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ మంచి రాజకీయ నాయకుడు కాగలడని జోస్యం చెప్పారు.
ధోనీకి మంచి పాపులారిటీ ఉంది : శుక్లా
"ధోనీకి పొలిటీషియన్ గా రాణించగలిగే సామర్థ్యం ఉంది. కానీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయం. ధోనీ బంగాల్ రాజకీయాల్లోకి వెళ్తాడని సౌరభ్, నేను భావించాం. అతడు రాజకీయాల్లోనూ రాణించగలడు. సులభంగా గెలుస్తాడు. అతనికి మంచి ప్రజాదరణ ఉంది" అని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.
అలాగే ధోనీతో ఓ సారి రాజకీయాల గురించి మాట్లాడినట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. "ఒకసారి ధోనీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని రూమర్ వచ్చింది. అది నిజం అనుకొని మహీతో దీని గురించి చర్చించాను. అవి కేవలం పుకార్లు మాత్రమే అని మహీ కొట్టిపారేశాడు. నిజానికి ధోనీ ఎక్కువగా బయట కనపడటానికి ఇష్టపడడు. ఫేమ్‌కు దూరంగా సైలెంట్ ఉంటాడు. కనీసం అతడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉండదు. కనీసం బీసీసీఐ సెలక్టర్లు కూడా అతడిని సంప్రదించాలన్నా కూడా కొన్నిసార్లు కుదరదు. కేవలం తాను చేసే పనిపై మాత్రమే ధోనీ దృష్టి సారిస్తాడు. దాన్నే సీరియస్ గా తీసుకుంటాడు" అని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు.