తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒక్క రన్ తేడాతో 8 వికెట్లు ఔట్ - 53 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా! - WA VS TAS ONE DAY CUP

52/2 నుంచి 53/10 - ఒక పరుగు తేడాతో ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Western Australia Vs Tasmania One Day Cup
Western Australia Vs Tasmania One Day Cup (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 25, 2024, 1:08 PM IST

ఆస్ట్రేలియా దేశీ టోర్నీ వన్డే కప్‌లో తాజాగా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. సొంతగడ్డపై వెస్టర్న్‌ ఆస్ట్రేలియాకు ఓ ఊహించని పరాభవం ఎదురైంది. టాస్మానియాతో తాజాగా జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్​ సేన, ఆ తర్వాతి రన్​కే ఎనిమిది వికెట్లు నష్టపోయి కుప్పకూలిపోయింది. అయితే ఆ ఒక్క రన్‌ కూడా వైడ్‌ కావడం విశేషం. మరి వెస్టర్న్‌ ఆస్ట్రేలియాకు ఈ రేంజ్ షాకిచ్చిన బౌలర్ ఎవరంటే?

ఇంతకీ ఏం జరిగిందంటే?
లిస్ట్‌-ఏ మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన టాస్మానియా బౌలింగ్ ఎంచుకోగా, వెస్టర్న్‌ ఆస్ట్రేలియాను తొలుత బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఓపెనర్‌ ఆరోన్‌ హార్డీ(7)ని పేసర్‌ టామ్‌ రోజర్స్‌ ఔట్​ చేయగా, మరో ఓపెనర్‌ ఆర్సీ షార్ట్‌(22) వికెట్‌ను బ్యూ వెబ్‌స్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాన్‌క్రాఫ్ట్‌(14) వికెట్‌ కూడా ఇతడే పడగొట్టాడు. ఈ క్రమంలో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగింది. అయితే, ఆ తర్వాతి ఓవర్‌ నుంచే టాస్మానియా స్పిన్నర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ తన ఆట మొదలుపెట్టాడు.

16వ ఓవర్​లో రెండు వికెట్లు పడగొట్టగా, వెస్టర్న్‌ ఆస్ట్రేలియా స్కోరు 52-4గా నిలిచింది. అయితే ఆ తర్వాత వెబ్‌స్టర్‌ తన బౌలింగ్ స్కిల్స్​తో చెలరేగిపోయాడు. పేసర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌తో కలిసి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.

వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 17వ ఓవర్​లో బిల్లీ స్టాన్‌లేక్‌ రెండు వికెట్లు కూల్చగా, ఆ తర్వాతి ఓవర్‌ ఆఖరి బంతికి వెబ్‌స్టర్‌ మరో వికెట్‌ పడగొట్టాడు. అలాగే 20వ ఓవర్​లో మరో రెండింటినీ, ఆ మరుసటి ఓవర్​లో ఏకంగా పదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలోనే 53 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఈ క్రమంలో 28 బంతుల వ్యవధిలో వైడ్‌ రూపంలో ఒక్క పరుగు మాత్రమే పొంది వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక 53 పరుగులకే ఓటమిని చవి చూసిన వెస్టర్న్‌ ఆస్ట్రేలియా వన్డే కప్‌ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది.

మరోవైపు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా కేవలం 8.3 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి టార్గెట్​ను ఛేదించింది. ఇక ఆరు వికెట్లతో హీరోగా మారిన బ్యూ వెబ్‌స్టర్‌ను 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు వరించింది.

జింబాబ్వే వరల్డ్ రికార్డ్- T20 హిస్టరీలోనే అత్యధిక స్కోర్

ఒక్క మ్యాచ్​తో కెరీర్ ఫినిష్​ - టీ20 తర్వాత క్రికెట్​కు దూరమైన 5 ప్లేయర్స్​ ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details