Alzarri Joseph Banned :వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. కెప్టెన్ షాయ్ హోప్‌తో గొడవ పడి మైదానాన్ని వీడిన అతడిపై వేటు వేస్తున్నట్లు విండీస్ బోర్డు తెలిపింది. మైదానంలో క్రమశిక్షణ లేకుండా, జట్టు ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఎవరినైనా సహించేది లేదని బోర్డు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడదల చేసింది.
ఇదీ జరిగింది
బార్బడోస్ వేదికగా విండీస్- ఇంగ్లాండ్ మధ్య గురువారం మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఫీల్డింగ్ సెట్టింగ్ విషయమై హోప్- జోసెఫ్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ ఆ ఓవర్ బౌలింగ్ కొనసాగించిన జోసెఫ్ నాలుగో బంతికి వికెట్ తీశాడు. దీంతో సంబరాలు చేసుకునేందుకు సహచర ప్లేయర్లు అతడి దగ్గరకు రాగా, జోసెఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ ఓవర్ పూర్తి ఆవ్వగానే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడి డగౌట్‌కు వెళ్లిపోయాడు.
దీంతో ఒక ఓవర్‌పాటు విండీస్ జట్టు 10 మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. అయితే జోసెఫ్ ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే బోర్డు అతడిపై చర్యలకు ఉపక్రమించింది. కాగా, తాజాగా వేటు పడడం వల్ల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జోసెఫ్ తొలి రెండు మ్యాచ్‌లు ఆడడం కుదరదు.