Kohli IPL Rival Naveen ul Haq :జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒకే ఓవర్లో ఏకంగా 13 బంతులు వేశాడు. అందులో ఆరు వైడ్లు, ఒక నోబాల్ ఉంది. ఈ ఓవర్ కారణంగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్థాన్ ఓటమి చవిచూసింది.
అసలేం జరిగిందంటే?
హరారే వేదికగా జింబాబ్వే, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. కరీమ్ జనత్ (54), మహ్మద్ నబీ (44) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ (3/28), ముజారబాని (1/26), ట్రెవోర్ గ్వాండు (1/35), వెల్లింగ్టన్ మస్కడ్జా (1/18) తలో వికెట్ తీశారు.
ఆఖరి బంతి వరకు తేలని ఫలితం
అనంతరం ఛేదనకు దిగిన జింబాబ్వే సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49), డియోన్ మైయేర్స్ (32) ఛేదనలో కీలక పాత్ర పోషించారు. అయితే జింబాబ్వే ఛేదన అంత సాఫీగా సాగలేదు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 21 పరుగులు అవసరం. అయితే 19వ ఓవర్ వేసిన నవీనుల్ హక్ 10 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.
దీంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 11 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్‌ను అజ్మతుల్లా వేయగా తొలి బంతిని తషింగ ముసేక్వా (16 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్) బౌండరీ బాదాడు. తర్వాతి రెండు బంతులకే రెండేసి చొప్పున డబుల్స్ సాధించాడు. కానీ నాలుగో బంతికి అజ్మతుల్లా పరుగులేమి ఇవ్వలేదు. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమవ్వగా, అయిదో బంతికి తషింగ రెండు పరుగులు సాధించాడు. చివరి బంతికి సింగిల్ తీసి జట్టును గెలిపించాడు.