Top 10 Controversies of Ind vs Aus Test : బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబరు 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఇందులో ఎలాగైనా గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్‌కు చేరుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్వదేశంలో కివీస్‌తో సిరీస్ ఓడిన టీమ్ఇండియా, ఆసీస్‌పై రాణించాలని యోచిస్తోంది. మరోవైపు, 10 ఏళ్ల తర్వాత భారత్‌పై టెస్టు సిరీస్ గెలవాలని ఆస్ట్రేలియా కసిగా ఉంది.
గత రెండు దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మధ్య టెస్టు క్రికెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని యాషెస్ సిరీస్‌లా మారిపోయింది. 1996లో ప్రారంభమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియానే పైచేయి సాధించింది. ఇప్పటివరకు 10 సార్లు భారత్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో భారత్- ఆసీస్ జట్లు మధ్య జరిగిన ఈ 10 వివాదాలు గురించి తెలుసుకుందాం.
1. మంకీ గేట్
క్రికెట్ చరిత్రలో మంకీగేట్ ఒక చీకటి అధ్యాయం. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టులో ఆసీస్ ప్లేయర్ ఆండ్రూ సైమండ్స్-హర్భజన్ సింగ్ మధ్య వివాదం జరిగింది. తనపై భజ్జీ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని సైమండ్స్ ఆరోపించాడు. మంకీగా సంబోధిస్తూ తిట్టాడని అన్నాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిఫరీ భజ్జీపై మూడు టెస్టుల నిషేధంతోపాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. దీనిపై భారత జట్టు యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో హర్భజన్‌కు 50శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు.
2. పేలవమైన అంపైరింగ్
2008 బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంపైర్లు పక్షపాతం వహించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలిచింది. ఈ సిరీస్‌లో ఒక జట్టు మాత్రమే స్పోర్టివ్ స్పిరిట్‌తో ఆడిందని అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.
3. గావస్కర్ ఫైర్
1981లో మెల్బోర్న్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. టీమ్ఇండియా బ్యాటర్ సునీల్ గావస్కర్, చేతన్ చౌహాన్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ విసిరిన బంతి గావస్కర్ కాలికి తగిలింది. దీంతో అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ఇచ్చాడు. అది ఔట్ కాదని సునీల్ గావస్కర్ బలంగా నమ్మాడు. మైదానంలో నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సునీల్ గావస్కర్‌పై డెన్నీస్ లిల్లీ కామెంట్ చేశాడు. దీంతో మైదానం నుంచి తనతో పాటు వచ్చేయాలని చేతన్ చౌహాన్‌ను గావస్కర్ కోరాడు. చేతన్, గావస్కర్ మైదానాన్ని వదిలివెళ్లగా మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. మళ్లీ కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగి మ్యాచ్ ప్రారంభమైంది.
4. గంగూలీ టాస్ ఆలస్యం
2001 టెస్టు సిరీస్‌లో సౌరభ్ గంగూలీ తనను టాస్ కోసం చాలాసేపు వేచి ఉండేలా చేశాడని స్టీవ్ వా ఆరోపించాడు. ఈ విషయం తనను చాలా గాయపర్చిందని పేర్కొన్నాడు. అయితే తన బ్లేజర్ కనిపించకపోవడం వల్లే టాస్కు ఆలస్యంగా వెళ్లానని గంగూలీ కొన్నాళ్ల తర్వాత చెప్పుకొచ్చాడు.
5. సచిన్ నాటౌట్
1999లో ఆసీస్ పేసర్ మెక్‌గ్రాత్ వేసిన బంతి సచిన్ భుజానికి తగిలింది. కానీ అంపైర్ ఔట్‌గా డిక్లేర్ చేశాడు. దీంతో సచిన్ డకౌట్ అయ్యాడు. ఈ విషయం కూడా అప్పట్లో దుమారం రేపింది. అంపైర్ నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.