No Duck Out Batsman : ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. భవిష్యత్‌లోనూ మరెన్నో రికార్డులు క్రియేట్ అవుతాయి. రన్స్, సెంచరీలు, వికెట్లు, క్యాచ్‌లు ఇలా అన్నింటిలోనూ రికార్డులు ఉంటాయి. వీటితో పాటు చెత్త రికార్డులు కూడా ఉంటాయి. అందులో ఒకటి డకౌట్.
పెవిలియన్ నుంచి గ్రౌండ్‌లోకి బ్యాట్‌తో అడుగుపెట్టిన ఓ ప్లేయర్ స్టేడియంలో లక్షలాదిమంది చూస్తుండగా డకౌట్ అయితే ఆ బాధ చెప్పలేనంతగా ఉంటుంది. ఏ పరుగులు చేయకుండా గోడకు కొట్టిన బంతిలా వెనక్కి రావాలని ఏ క్రికెటరూ కోరుకోడు. కానీ స్టార్ క్రికెటర్లు కూడా కెరీర్‌లో ఏదో ఒక సందర్భంలో సున్నా పరుగులకే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే కొందరు ప్లేయర్‌లు కనీసం ఒక్క ఫార్మాట్‌లో అయినా డకౌట్ కాకుండా ఉన్నారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్న కొంతమంది క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యశ్‌పాల్ శర్మ (వన్డే) -యశ్‌పాల్ శర్మ 1974లో భారత్ తరఫున వన్డేలు ఆడటం ప్రారంభించాడు. అప్పటి నుంచి మొత్తం 256 మంది క్రికెటర్లు వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఆటగాళ్లందరిలో యశ్‌పాల్ శర్మ ఒక్కడే ఎప్పుడూ డకౌట్ అవ్వలేదు. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా యశ్‌పాల్ కీలక ఆటగాడు. 1978 నుంచి 1985 వరకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించాడు. అతడి కెరీర్‌లో యశ్‌పాల్ శర్మ 42 మ్యాచ్‌లు ఆడాడు. 40 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. 28.48 యావరేజ్, 63.02 స్ట్రైక్ రేట్‌తో 883 పరుగులు చేశాడు.
బ్రిజేష్ పటేల్ (టెస్ట్) -మరో భారత మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ టెస్టుల్లో ఎప్పుడూ డకౌట్ కాలేదు. 1974 నుంచి 1977 మధ్య పటేల్ భారత్ తరఫున 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 29.45 యావరేజ్‌తో 972 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 115 నాటౌట్. 38 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ బ్రిజేష్ ఎప్పుడో డకౌట్ కాలేదు. బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవగలిగాడు.