Gautam Gambhir India Coach:టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపిక లాంఛనమే అని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. కానీ, ఈ విషయంపై గంభీర్ ఎక్కడా మాట్లాడలేదు. అయితే తొలిసారి దీనిపై గంభీర్ మాట్లాడాడు. 'టీమ్ఇండియాకు కోచ్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తా' అని గంభీర్ అన్నాడు. అబుదాబిలోని ఓ హాస్పిటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో గంభీర్ ముచ్చటించాడు.
ఈ క్రమంలో 'ఒకవేళ మీరు టీమ్ఇండియాకు కోచ్ అయితే వరల్డ్‌కప్ గెలవడానికి ఎలా పని చేస్తారు' అని ఓ విద్యార్థి గంభీర్‌ను అడిగాడు. దీనికి గంభీర్ సమాధానమిచ్చాడు.'ఈ ప్రశ్న ఇప్పటివరకు చాలామంది నన్ను అడిగారు. దీనికి ఎవరికీ జవాబు ఇవ్వాలేదు. కానీ, ఇప్పుడు నీకు సమాధానం చెప్తా. టీమ్ఇండియాకు కోచ్‌గా ఉండాలనుకుంటున్నా. మన జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం కంటే గొప్పది ఇంకోటి లేదు. ఇది 140 కోట్ల మంది భారతీయలకు ప్రాతినిధ్యం వహించడం లాంటిది. అంతకంటే పెద్దది మరొకటి ఉందా? భారత్ ప్రపంచకప్ గెలవడానికి నేను ఒక్కడిని సహకరిచడం కాదు. 140 కోట్ల భారతీయులు టీమ్ఇండియా వరల్డ్‌కప్ నెగ్గడానికి సహకరిస్తారు. ట్రోఫీ నెగ్గాలని అందరూ ప్రార్థిస్తే, భారత్ కచ్చితంగా వరల్డ్‌కప్ గెలుస్తుంది' అని గంభీర్ అన్నాడు. కాగా, ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవి ఈనెల (2024 జూన్) చివరి వారంతో ముగుస్తుంది. కొత్తగా ఎంపికైన కోచ్ 2027 వరల్డ్‌కప్ దాకా కొనసాగనున్నాడు.