Rohit Sharma Pitch:13 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించాడు. కల సాకారమైన వేళ హిట్ మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు. జగజ్జేతలుగా నిలిచిన వేళ బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత త్రివర్ణ పతాకాన్ని పాతాడు. ఆ తర్వాత బార్బడోస్ మైదానంలో గ్రాస్ (Pitch Grass) రుచి చూసి రోహిత్ శర్మ పిచ్పట్ల గౌరవాన్ని చాటుకున్నాడు.
భారత శిబిరం అంతా ఆనంద భాష్పాలు రాలుస్తున్న వేళ బార్బడోస్ పిచ్‌పైన ఉన్న మట్టిని తీసి రోహిత్ నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో నెటిజన్లు రోహిత్‌ను మెచ్చుకుంటున్నారు. వరల్డ్‌కప్ కల నెరవేర్చిన పిచ్‌కు రోహిత్ నమస్కరించడం అతడి సంస్కారానికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. 'పిచ్ పట్ల అతడికి అపారమైన గౌరవం ఉంది' 'అది మరాఠా సంప్రదాయం' అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
చాలా కష్టపడ్డాం: రోహిత్
పొట్టి ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ 20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీ వైపు భారత జట్టు ప్రయాణం ఎలా సాగిందో వివరించాడు. వ్యక్తిగతంగా, టీమ్‌గా తాము విశ్వ విజేతలుగా నిలవడానికి చాలా కష్టపడ్డామని హిట్‌మ్యాన్ తెలిపాడు. పొట్టి ప్రపంచకప్ గెలిచేందుకు చాలా శ్రమించామని కొన్ని నెలలు ముందుగానే ప్రణాళిక రచించినట్లు చెప్పాడు. తెరవెనక చాల శ్రమ జరిగిందని టీమ్ఇండియాకెప్టెన్ తెలిపాడు.