Rohit Sharma T20 Retirement:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గిన తర్వాత హిట్‌మ్యాన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అటకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ ట్రోఫీ కచ్చితంగా గెలవాలనుకున్నాననీ, విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని తెలిపాడు. ఇక రోహిత్ కంటే కాస్త ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
'ఇది నా ఆఖరి టీ20 మ్యాచ్. టీ20 ఫార్మాట్‌తోనే టీమ్ఇండియాలో ఎంట్రీ ఇచ్చాను. క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఈ ఫార్మాట్‌ను బాగా ఎంజాయ్ చేశాను. టీ20లకు గుడ్‌బై చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి లేదు. ఈ టైటిల్ గెలవాలనున్నాను, గెలిచాను' అని రోహిత్ ఫైనల్ మ్యాచ్ అనంతరం అన్నాడు. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ భావోద్వేగానికి లోనయ్యాడు. టీమ్ఇండియా విజయం అందుకోగానే నేలపై వాలిపోయాడు. సహాచర ఆటగాళ్లంతా రోహిత్ వద్దకు వెళ్లి సంబరాలు చేసుకున్నారు.
ఇక 2007లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ దాదాపు 17ఏళ్లు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఇప్పటివరకూ 4231 పరుగులు చేశాడు. అందులో అత్యధికంగా 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఈ పొట్టి ఫార్మాట్లో 5 సెంచరీలు బాదిన బ్యాటర్ రోహిత్ శర్మ. ఇక అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు బాదిన లిస్ట్‌లో ప్రస్తుతం రోహిత్ శర్మదే ఆగ్రస్థానం. ఈ లిస్ట్‌లో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ 4188 రెండో స్థానంలో ఉన్నాడు.