Gurukulas 10th Passed Students Get Direct Seat in Inter : ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేరుగా ఇంటర్మీడియట్‌లో ప్రవేశం కల్పించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు కలగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇంటర్ గురుకుల కళాశాలల్లో వంద శాతం సీట్లను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పరీక్ష లేకుండా ప్రవేశం : ఇప్పటి వరకు ఇంటర్ గురుకుల కళాశాలల్లో ప్రవేశం కల్పించడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సొసైటీలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ ఇచ్చేవారు. ఒక్క మైనార్టీ గురుకులాల్లో మాత్రం ఎవరు ముందు సీటు తీసుకోవడానికి వస్తారో వారికి అడ్మిషన్ ఇచ్చేవారు. అర్హత సాధించని విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చేరేవారు. పేద విద్యార్థులు ప్రైవేటులో చేరే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడేవారు. అర్హత సాధించిన వారు లేకపోవడంతో చాలా సీట్లు మిగిలిపోయేవి. దీన్ని నివారించేందుకు గురుకుల సొసైటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
తగ్గనున్న ఆర్థిక భారం : వికారాబాద్ జిల్లాలో ఎస్సీ 6, ఎస్టీ 4, బీసీ 10, మైనార్టీ 6 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పదో తరగతి విద్యార్థులు 2 వేలకు పైగా చదువుకుంటున్నారు. ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండడంతో అర్హత సాధించిన వారికి మాత్రమే అడ్మిషన్ లభిస్తోంది. దీంతో కొందరు సీట్ల కోసం ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. గురుకుల పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థికి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్ గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని సొసైటీలు తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ - ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థికి పాము కాటు! - ప్రిన్సిపల్ సస్పెండ్
ఇకపై అందరికీ 'కామన్ డైట్' - నేటి నుంచి గురుకులాల బాట పట్టనున్న సర్కార్