Paris Paralympics 2024 Cash Prize : పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలు అందుకోలేకపోయారు. కానీ పారిస్ పారాలింపిక్స్‌లో పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సారి మొత్తం 84 మంది అథ్లెట్లు పోటీపడగా, దేశానికి 29 పతకాలు లభించాయి. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. పతకాలు కొల్లగొట్టిన విజేతలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందుకొన్నారు.
మంగళవారం న్యూ దిల్లీలో జరిగిన వేడుకల్లో పారాలింపిక్ విజేతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులకు క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవియా నగదు పురస్కారాలను ప్రకటించారు.
బంగారు పతక విజేతలకు రూ.75 లక్షలు
పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.75 లక్షలు అందుకుంటారు. రజత పతక విజేతలకు రూ.50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.30 లక్షలు నగదు బహుమతి అందజేస్తామని క్రీడా మంత్రి ప్రకటించారు. అదే సమయంలో, ఆర్చర్ శీతల్ దేవి వంటి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పతకాలు సాధించిన వారికి రూ.22.5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
పారా అథ్లెట్లకు మరిన్ని సౌకర్యాలు
2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు పారా అథ్లెట్లకు పూర్తి మద్దతు, సౌకర్యాలు కల్పిస్తామని మాండవ్య హామీ ఇచ్చారు. పారాలింపిక్స్, పారా స్పోర్ట్స్‌లో భారత్ రాణిస్తోందని తెలిపారు. 2016లో 4 పతకాలు సాధించగా, 2020 టోక్యోలో 19 పతకాలు, పారిస్‌లో 29 పతకాలతో అద్భత పురోగతి కనబరిచింది. ఈ నేపథ్యంలోనే బంగారు పతకాలు సాధించేందుకు వీలుగా పారా అథ్లెట్లు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాండవ్య తెలిపారు.