KL Rahul Sanjiv Goenka: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ప్రవర్తించిన తీరును సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ గ్రేమ్ స్మిత్ తప్పుబట్టాడు. మ్యాచ్ అనంతరం సంజీవ్ గోయెంకా ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని స్మిత్ అన్నాడు. అలాంటి చర్చలు పర్సనల్‌గా నాలుగు గదుల లోపల జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
బుధవారం సన్‌రైజర్స్- లఖ్‌నవూ మ్యాచ్ అనంతరం స్మిత్ జియో సినిమా చిట్‌చాట్‌లో మాట్లాడాడు. 'ఓ యజమాని తన జట్టు పట్ల ప్రేమ కలిగి ఉండడం సహజమే. కానీ, అప్పటికే భారీ ఓటమితో జట్టు ప్లేయర్లంతా ఎమోషనల్‌గా కుంగిపోయి ఉన్నారు. మ్యాచ్ ఫలితంపై చర్చించాలనుకుంటే అది సరైన సందర్భం కాదు. ఇలాంటివి నాలుగు గదుల లోపల మాట్లాడుకోవాలి. అక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలు ఏదీ మిస్ అవ్వకుండా అన్ని సన్నివేశాలను బంధిస్తాయి' అని స్మిత్ అన్నాడు.
జరిగింది ఇదీ:అయితే బుధవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను లఖ్‌నవూ మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లఖ్‌నవూ ఓనర్ సంజీవ్, కెప్టెన్ రాహుల్‌తో అసంతృప్తితో మాట్లాడినట్లు కనిపించారు. గోయెంకా కోపంగా రాహుల్‌తో ఏదో అన్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. రాహుల్ ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా గోయెంకా వినడానికి ఇష్టపడలేదు. ఇంతలోనే అక్కడకు కోచ్ జస్టిన్ లాంగర్ రాగా, రాహుల్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మరి అక్కడ జరిగిన సంభాషణ గురించి తెలియాలంటే లఖ్‌నవూ యాజమాన్యం స్పందించాల్సిందే.