How Much Salt Intake per Day: మనం ఎంత గొప్ప వంటకం చేసినా అందులో సరిపడా ఉప్పు లేకపోతే దానిలోని రుచి బయటకు రాదు. అలాగని దీన్ని ఎక్కువగా తినటానికీ లేదని నిపుణులు చెబుతుంటారు. ఉప్పులోని సోడియం మితిమీరితే గుండె, కిడ్నీ జబ్బులు, పక్షవాతం ముప్పులు పెరుగుతాయని వెల్లడిస్తున్నారు. అందుకే సోడియం వాడకాన్ని రోజుకు 2 గ్రాముల కన్నా మించనీయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(రిపోర్ట్) సిఫారసు చేస్తుంది. ఒకవేళ ఉప్పు వాడాలనుకుంటే పొటాషియంతో కూడిన తక్కువ సోడియం ఉప్పు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాలు గర్భిణులు, పిల్లలు, కిడ్నీ జబ్బు బాధితులకు వర్తించవనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మరణాలు సరైన ఆహారం తీసుకోకపోవటం వల్లే జరుగుతున్నాయి. ఇంకా వీటిల్లో 19 లక్షల మరణాలకు అధిక ఉప్పు (సోడియం) వాడకమే కారణమవుతుంది. అందుకే సోడియం వాడకాన్ని తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, దీర్ఘకాల కిడ్నీ జబ్బు వంటి సాంక్రమికేతర జబ్బుల వచ్చే అవకాశం తగ్గుతుంది. అధిక సోడియం వాడకంతో ముడిపడిన జీర్ణాశయ క్యాన్సర్ వంటి ఇతర వ్యాధుల ముప్పులూ తగ్గుతాయి. సోడియం క్లోరైడ్‌తో కూడిన ఉప్పు బదులు పొటాషియం క్లోరైడ్ గల ఉప్పు వాడితే రక్తంలో సోడియం లెవల్స్ తగ్గుతాయి. మరోవైపు రక్తపోటును తగ్గించే పొటాషియం మోతాదూ పెరుగుతుంది.

మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 26 ప్రయోగ పరీక్షలను విశ్లేషించిన నిపుణుల అభిప్రాయం మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. తక్కువ సోడియం ఉప్పుతో సిస్టాలిక్ రక్తపోటు 4.76 ఎంఎంహెచ్‌జీ, డయాస్టాలిక్ రక్తపోటు 2.43 ఎంఎంహెచ్‌జీ తగ్గుతున్నట్టు ఈ పరీక్షల్లో వెల్లడైంది. ప్రాణాంతకం కాని పక్షవాతం ముప్పు 10%, గుండెజబ్బు మరణాలు 23% మేరకు తగ్గుముఖం పడుతున్నట్టూ తేలింది. పొటాషియం క్లోరైడ్ ఉప్పుతో రక్తంలో పొటాషియం మోతాదూ పెరుగుతున్నట్టు బయటపడింది. వాస్తవానికి మొత్తంగా సోడియం వాడకాన్ని తగ్గించుకోవటమే అన్నింటికన్నా ముఖ్యం. కానీ, ఇది సాధ్యం కానప్పుడు తక్కువ సోడియం ఉప్పు వాడుకోవటం మంచిది.

ఉప్పులోని సోడియం క్లోరైడ్ రక్తపోటు మీద గణనీయమైన ప్రభావాన్నే చూపిస్తుంది. రక్తంలో సోడియం మోతాదులు పెరిగితే రక్తనాళాలు మరింతగా సంకోచిస్తాయి. మరోవైపు రక్తంలో ద్రవాల శాతం ఎక్కువై రక్తం పరిమాణమూ పెరుగుతుంది. రక్త రక్తనాళాల సామర్థ్యం నిర్ణీతమై ఉంటుంది. ఒకవైపు ఇవి సంకోచించటం, మరోవైపు రక్తం పరిమాణం పెరగటం వల్ల రక్తపోటూ ఎక్కువ అవుతుంది. ఇంకా గుండె మీద ప్రధానంగా, ఎక్కువగా ప్రభావం చూపేది ఇదే. రక్తపోటు పెరిగినప్పుడు గుండె మీద ఎక్కువ భారం పడుతుంది. దీంతో మరింత బలంగా సంకోచిస్తూ.. రక్తాన్ని పంప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అదేపనిగా గుండె బలంగా పనిచేస్తుంటే దాని కండరం మందమవుతుంది (హైపర్‌ట్రోఫీ). ఈ మందమైన కండరానికి మరింత ఎక్కువ రక్తం కావాల్సి ఉంటుంది. కానీ దీనికి తగినట్టుగా గుండె రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేయలేక.. గుండె కండరం బలహీనపడుతూ వస్తుంది. ఇది చివరికి గుండె వైఫల్యానికి కారణం అవుతుంది. ఒకవేళ హఠాత్తుగా ఉన్నట్టుండి గుండె విఫలమైతే.. రక్తం వెనక్కి ఎగదన్నుకొచ్చి, ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోయే (హైపర్‌టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్) అవకాశం ఉంది. ఇలాంటివారిని ఒక్కోసారి వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిచాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు పరోక్షంగా గుండె రక్తనాళాల మీదా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రక్తనాళాలూ మందం కావడమే కాకుండా.. పూడికలకు ఆస్కారం కలిగించొచ్చు. ఇది గుండె పోటుకు దారితీసే ప్రమాదం ఉంది. అప్పటికే గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్టయితే మరింత ముప్పు పెరుగుతుంది.
--డాక్టర్ ఎ.వి.ఆంజనేయులు, కార్డియాలజిస్ట్
కారణమేదైనా
ఆహారం ద్వారా సోడియాన్ని ఎక్కువగా తీసుకోవటంతోనే కాకుండా.. ఇది శరీరంలోంచి సరిగా బయటకు వెళ్లపోవటమూ సమస్యేనని డాక్టర్ ఆంజనేయులు వెల్లడిస్తున్నారు. ఇంకా రక్తంలో సోడియం పాళ్లు ఎక్కువవుతాయని.. మినరలోకార్టికాయిడ్స్, కార్టికోస్టిరాయిడ్ల వంటి హార్మోన్లు ఎక్కువైనా సోడియం మోతాదులు పెరుగుతాయంటున్నారు. ఇలా ఏ కారణంతో సోడియం పెరిగినా రక్తపోటు ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. అయితే ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవటం ద్వారా దీని దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. సోడియాన్ని కొంత తగ్గించి, దాని స్థానంలో పొటాషియం క్లోరైడ్‌ను చేర్చుకోవటమూ మంచిదేనని సలహా ఇస్తున్నారు. ఇది సోడియానికి పూర్తి వ్యతిరేకమని.. సోడియం రక్తనాళాలు సంకోచించేలా చేస్తే పొటాషియం రక్తనాళాలను విప్పారేలా చేస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా సాగి, రక్తపోటు తగ్గుముఖం పడుతుందని తెలిపారు. అందుకే అధిక రక్తపోటు గలవారిని పొటిషియంతో కూడిన అరటి పండ్ల వంటివి ఎక్కువగా తినమని చెబుతున్నారు. ఇది బీపీ తగ్గటానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అలాగని పొటాషియం క్లోరైడ్‌ను మరీ ఎక్కువగా తీసుకోవటమూ మంచిది కాదని.. దీని విషయంలోనూ పరిమితి పాటించటం తప్పనిసరని వివరిస్తున్నారు.


NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పప్పులు తింటే నిజంగానే గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్య వస్తుందా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?
మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? ముందే గుర్తిస్తే ఆ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చట!