Sneh Rana IND Vs SA Womens Test : సౌతాఫ్రికా మహిళలతో తాజాగా జరిగిన టెస్ట్ క్రికెట్లో టీమ్ఇండియా అమ్మాయిలు రాణించారు. సఫారీలపై 10 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు చెందిన యంగ్ క్రికెటర్ స్నేహ్ రాణా ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి, ఈ ఫీట్ సాధించిన తొలి భారత స్పిన్నర్‌గా చరిత్రకెక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లను నేలకూల్చి సౌతాఫ్రికాను చిత్తు చేసిన స్నేహ్, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉండగా, ఈ లిస్ట్‌లో ఈమెకంటే ముందు సీనియర్ ప్లేయర్ జులాన్ గోస్వామి ఉండటం విశేషం. 2006లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 10 వికెట్లు పడగొట్టారు. అయితే స్పిన్నర్లలో మాత్రం ఈ ఘనత నమోదు చేసిన తొలి భారత ప్లేయర్ రికార్డు మాత్రం స్నేహ్ పేరిటనే ఉంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్)ను 232/2 స్కోరుతో ఆరంభించిన దక్షిణాఫ్రికా.. 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని టీమ్‌ఇండియా 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. షఫాలీ వర్మ (24*), శుభా సతీష్ (13) పరుగులు చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 603/6 రికార్డు స్కోరు సాధించి డిక్లేర్డ్ చేయగా, షెఫాలి వర్మ (205), స్మృతి మంధాన (149)మరోసారి సత్తాచాటారు. వీరితో పాటు రిచా ఘోష్ (86), హర్మన్‌ప్రీత్ కౌర్ (69), జెమీమా రోడ్రిగ్స్ (55) కూడా తమ ఇన్నింగ్స్‌లో రాణించారు.