Shooter Manu Bhaker In Chennai :పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత షూటింగ్ స్టార్ మను భాకర్‌ను చెన్నైలో ఘనంగా సన్మానించారు. నోలంబూర్‌లోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో ఆమెకు సన్మాన కార్యక్రమం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తరఫున మను బాకర్‌కు రూ.2.07 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఆ తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మను భాకర్ సమాధానాలు చెప్పింది. వారితో కలిసి పాటలు పాడుతూ సరదాగా గడిపింది.
"పెద్ద కలలు కనాలి, వాటిని సాధించేందుకు కష్టపడాలి. ఫెయిల్ అయినా వదలకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను నా స్కూల్ డేస్‌లోనే కాంపిటీషన్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాను. స్కూల్ డేస్‌లో మనకు మొదట ఇంట్లో, తర్వాత స్కూల్లో సపోర్ట్ కావాలి. నాకు ఆ రెండూ లభించాయి. జీవితంలో డాక్టర్, ఇంజనీర్ మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రీడా రంగంలో ఎక్కువ అకాశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ప్రయాణించాలనే కోరిక ఉన్న వాళ్లు స్పోర్ట్స్ కెరీర్‌ని ఎంచుకోవాలి, నేను ఇప్పటికే సగం ప్రపంచం ట్రావెల్ చేశాను. మన నేపథ్యం గురించి చెప్పడంలో ఎప్పుడూ సిగ్గుపడకండి. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ముఖ్యం కాదు. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు చాలా విషయాలు తెలియవు, తర్వాత నేర్చుకున్నాను. వారు నేర్పించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు నేను చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. నాకు ఆత్మవిశ్వాసం లేదు. వీటిని ఏదో ఒక దశలో వదిలేయాలి. అదే చేశాను. ఎన్నో ఫెయిల్యూర్స్ కారణంగానే ఇప్పుడు విజయం సాధించగలిగాను" అని మను భాకర్ పేర్కొంది.
'సీఎం తెలియదు - ఆ హీరో బాగా తెలుసు'
అయితే ఈ సెషన్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అక్కడి వారు 'మీకు మా సీఎం స్టాలిన్ తెలుసా' అని అడిగిన ప్రశ్నకు మను అమాయకంగా తెలియదూ అంటూ తల ఊపింది. ఆ తర్వాత 'హీరో విజయ్ తెలుసా' అంటే దానికి ఆమె ఆయన నాకు చాలా బాగా తెలుసు అంటూ సమాధానమిచ్చింది. దీంతో అక్కడి వారంతా నవ్వారు.
ఆ తర్వాత మను బాకర్ మీడియాతో మాట్లాడింది. మీ విజయానికి కారణం ఎవరనే? ప్రశ్నకు "నా విజయానికి చాలా మంది కారణం. నా కుటుంబం, కోచ్, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇతరుల సమిష్టి కృషి ఉంది." అంటూ సమాధానమిచ్చింది.