Sarfaraz Khan IND vs ENG Test Series 2024 : రెండో టెస్టుకు ముందు జడేజా, కేఎల్ రాహుల్ గాయపడి మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో వారి స్థానాల్లో కేవలం నాలుగు టెస్టులే ఆడిన వాషింగ్టన్ సుందర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇంకా అడుగు పెట్టని మరో ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. అయితే వారిలో అందరి దృష్టి సర్ఫరాజ్ ఖాన్‌పైనే (Sarfaraz Khan)పైనే ఉంది. పుజారా, రహానె వంటి సీనియర్లను కాదని, ఈ కుర్రాడివైపే బీసీసీఐ మొగ్గు చూపడానికి పలు కారణాలున్నాయి.
ఫామ్ ఇలా ఉంది : సర్ఫరాజ్ ఖాన్ రీసెంట్ ఫామ్‌ను పరిశీలిస్తే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో సెంచరీ (160 బంతుల్లో 161 పరుగులు) సాధించాడు. 18 ఫోర్లు, 5 సిక్స్‌లతో వన్డే స్టైల్లో సెంచరీ బాదాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 45 మ్యాచుల్లో 3,912 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు (ఒక ట్రిపుల్ సెంచరీ), 11 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.
2022 రంజీ సీజన్‌లో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్ నేషనల్ టీమ్‌కు రావడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. టెస్టు సిరీస్ కోసం టీమ్‌ను అనౌన్స్ చేసే ప్రతీ సారి సర్ఫరాజ్ పేరు చర్చకొస్తుంటుంది. కానీ సీనియర్ల రేసులో వెనక ఉండిపోయేవాడు. అయితే ఈసారి టెస్టు క్యాప్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. జట్టులో ఖాళీ అయిన రాహుల్ స్థానంలో అతడు ఎంపికయ్యాడు. ఎందుకంటే రాహుల్ స్థానంలో ఆడాల్సిన బ్యాటర్‌కు కావాల్సిన లక్షణాలు అన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. భారీ ఇన్నింగ్స్‌లు, స్పిన్ ట్రాక్‌ల మీద నిలదొక్కుకోవడం చేయాలి. అవి ఇప్పటికే అతడు రంజీల్లో చేశాడు. కానీ తుది జట్టులో చోటు దక్కి, జోరు మీదున్న ఇంగ్లాండ్‌ను ఎదుర్కోగలిగితే మిగిలిన మూడు టెస్టుల్లోనూ అతడు కొనసాగే అవకాశం ఉంటుంది.
తుది జట్టులో కష్టమే : ఇకపోతే ఈ రెండో టెస్టు కోసం సర్ఫరాజ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ ఎంపికయ్యారు. అయితే వీరికి తుది జట్టులో చోటు కష్టమనే చెప్పాలి. ఇప్పటికే స్పిన్ కోటాలో జడ్డూ లేనప్పటికీ కుల్‌దీప్ యాదవ్ ఉన్నాడు. సుందర్, సౌరభ్ ఇద్దరూ బ్యాటింగ్‌తోపాటు స్పిన్ బౌలింగ్ చేయగలుగుతారు కానీ స్పెషలిస్ట్ స్పిన్నర్లో కుల్‌దీప్ ముందుంటాడు.