Paris Paralympics Sarah Storey 18 Gold Medals : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ పతకాలు సాధిస్తున్నారు. అయితే ఈ విశ్వ క్రీడల్లో పతకాలు సాధించి తమ దేశానికి కీర్తి తెచ్చి పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు కూడా సత్తా చాటుతున్నారు. వైకల్యం తమకు అడ్డుకాదని నిరూపిస్తున్నారు.
అయితే ఈ విశ్వ క్రీడలకు సంబంధించి గత రెండున్నర దశాబ్దాలుగా ఏకంగా 18 గోల్డ్ మెడల్స్‌తో పాటు ఎన్నో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను అందుకుని రికార్డులు సృష్టిస్తోంది సారా స్టోరే. 46ఏళ్ల వయసులోనూ అలుపెరగని పోరాట పటిమతో ఎంతో మంది స్పూర్తిగా నిలుస్తోంది.
సారా స్టోరే ఎవరంటే? - సారా స్టోరే బ్రిటన్‌కు చెందిన పారాలింపియన్. ఆమెకు పుట్టుకతోనే ఎడమ చేతికి వైకల్యం ఉంది. అయినా కూడా స్విమ్మింగ్‌లోకి దిగి తన ప్రతిభను చాటింది. 14 ఏళ్ల వయసులోనే పారాలింపిక్ పోటీల్లో పాల్గొని మొదటి సారి మెడల్‌ను అందుకుంది. అలా 1992 నుంచి 2004 వరకు నాలుగు సార్లు పారాలింపిక్స్ బరిలోకి దిగి మొత్తంగా ఐదు గెల్డ్ మెడల్స్, ఎనిమిది సిల్వర్ మెడల్స్, మూడు బ్రాంజ్ మెడల్స్‌ను సాధించింది.
సైక్లింగ్‌ను పతకాల వేట - మొదట స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్న సారా స్టోరే, ఏథెన్స్ పోటీల తర్వాత సైక్లింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. అందులోనూ పతకాలు సాధించింది. బీజింగ్, లండన్ పోటీల్లోనూ ఎన్నో మెడల్స్‌ను ముద్దాడింది. టోక్యో పారాలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పాల్గొన్న సారా అప్పుడు మూడు గోల్డ్ మెడల్స్ సాధించి సెన్సేషనల్ క్రియేట్ చేసింది.