Sanjay Manjrekar About Gautam Gambhir :త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా టూర్ కోసం భారత జట్టు రెండు టీమ్స్‌గా రెడీగా ఉంది. తొలుత కుర్రాళ్లు వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, ఆకాశ్ దీప్, శుభ్‌మన్ గిల్‌తోపాటు సపోర్టింగ్ కోచ్ అభిషేక్ నాయర్ తదితరులు అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్ప మిగతా వారితో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రెండో టీమ్‌గా వెళ్లనున్నాడు.
మరోవైపు హిట్‌మ్యాన్ తొలి మ్యాచ్‌లో ఆడతాడా లేదో తెలియని పరిస్థితి నెలకొంది. విరాట్ ఇప్పటికే తన సతీమణితో కలిసి పెర్త్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు ఓ స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కోచ్ గంభీర్, ఆ సమావేశంలో పలు కీలక విషయాలపై స్పందించాడు. అయితే, గంభీర్ ఇలా విలేకర్ల సమావేశంలో పాల్గొనడంపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కమ్ కామంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిన్ని ఎప్పుడూ ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు పంపించొద్దంటూ బీసీసీఐని సోషల్ మీడియా వేదికగా కోరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
"ఇంతకుముందే గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. మున్ముందూ అతడికి ఇటువంటి బాధ్యతలు అప్పగించకుండా బీసీసీఐ కాస్త తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. గంభీర్‌ను కొంచం తెర వెనుక పని చేయనివ్వండి. అంతేకానీ, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాత్రం అతడికి మాట్లాడే హక్కే లేదు. కోచ్‌గా తను స్పందించకుండా ఉండాలి. అతడికి బదులు కెప్టెన్ రోహిత్ శర్మ లేకుంటే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందు మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. వారిద్దరే ఉత్తమ ఎంపిక అవుతుందని భావిస్తున్నాను" అంటూ మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.