NO Promotions Lab Technicians : ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఎక్కడైనా పదోన్నతులు కల్పించడం సహజం. ఇలాంటి ప్రోత్సాహకాలతో వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారు. అది పదవీ విరమణకు వచ్చేసరికి వారి కేడర్ పెరిగి చాలా సంతోషంగా రిటైర్మెంట్ చేస్తారు. కానీ కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్న వారు మాత్రం దశాబ్దాలుగా ఒక్క పదోన్నతికీ నోచుకోకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారు.
రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ల (ఎల్‌టీ)దీ ఇదే పరిస్థితి. 1990-95 మధ్యకాలంలో ఎల్‌టీ గ్రేడ్-2గా ఉద్యోగంలో చేరిన సుమారు 800 మంది వైద్యారోగ్యశాఖలోని ప్రజారోగ్య సంచాలకుల(డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) విభాగం కింద విధులు నిర్వహిస్తున్నారు. వీరి విధి వివిధ రకాల రక్త, మూత్ర పరీక్షలు, ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్ కేంద్రాల్లో ఎల్‌టీ గ్రేడ్-2ల పాత్ర ఎంతో కీలకంగా మారింది.
అర్హులైన వారికి గ్రేడ్-1 పదోన్నతి కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చొరవ లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎల్‌టీ గ్రేడ్-2 జిల్లాస్థాయి పోస్టుగా ఉండేది, ఇప్పుడవి జోనల్ పోస్టులుగా మారాయి. ఏడు జోన్‌లలో గ్రేడ్-1 పోస్టులు 114 ఖాళీలు ఉన్నాయి. పని తీరు ఆధారంగా పదోన్నతులు కల్పించి, ఆయా పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో పలు బోధనాసుపత్రుల్లో జూనియర్ అనలిస్టు(JA) పోస్టులు 25 వరకు ఖాళీగా ఉండగా, డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన వారికి జూనియర్ అనలిస్టుగా(జేఏ)గా పదోన్నతి కల్పించవచ్చు. కానీ అదీ కూడా జరగడం లేదు.
పదోన్నతుల విభాగంలో జాప్యం : ఎల్‌టీ గ్రేడ్-2లలో సుమారు 200 మంది వరకు డిగ్రీలో కెమిస్ట్రీ చదివిన వారు ఉండగా, పదోన్నతులు కల్పించే దిశగా ఉన్నతాధికారులుగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పదోన్నతుల అంశంపై న్యాయస్థానం పచ్చ జెండా ఊపినా ఆ దిశగా కార్యాచరణ మాత్రం కరవైందని అక్కడి వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. వైద్య విధాన పరిషత్తులో సుమారు 40 మంది ఎల్‌టీలకు పదోన్నతులు కల్పించారు. ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో మాత్రం జాప్యం జరుగుతోందని వారు తెలిపారు. ఈ విషయంపై ప్రజారోగ్య సంచాలకుడు(DH) రవీంద్రనాయక్ మాట్లాడుతూ, ఎల్‌టీ గ్రేడ్-2లో అర్హులైన వారికి త్వరలోనే పదోన్నతి కల్పిస్తామన్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో పదోన్నతులు కల్పించే ప్రక్రియ సైతం మొదలైందని తెలిపారు.