Sakshi Malik Fake Certificates:సస్పెన్షన్ ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) అధ్యక్షుడు సంజయ్ సింగ్‌పై, ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు చేసింది. క్రీడా నిబంధనలకు విరుద్ధంగా ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించి సంజయ్‌సింగ్ అథ్లెట్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సర్టిఫికెట్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన సాక్షి, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరింది.
'భారత ప్రభుత్వం బ్రిజ్‌భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేసినా ఆయన ఇష్టానుసారంగా ప్రవరిస్తున్నారు. క్రీడా మంత్రిత్వశాఖ త్వరలో జైపుర్‌లో జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనుంది. కానీ అంతకంటే ముందే సంజయ్ సింగ్ రెజ్లింగ్ సమాఖ్యపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పోటీలు నిర్వహించి క్రీడాకారులకు ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సస్పెండైన వ్యక్తి సమాఖ్య నిధులు ఎలా దుర్వినియోగం చేస్తారు? భవిష్యత్‌లో ఈ ఫేక్ సర్టిఫికెట్లతో క్రీడాకారులు ఉద్యోగాల కోసం వెళ్తే వారిపైనే చర్యలు తీసుకుంటారు. ఇందులో ప్లేయర్ల తప్పేమీ లేదు. ఈ చర్యలకు పాల్పడిన సంజయ్ సింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయంపై స్పందించి ప్లేయర్ల కెరీర్లు కాపాడాలని కోరుతున్నా' అని సాక్షి రాసుకొచ్చింది.
ఇది విషయం:2023 డిసెంబరులో కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్ కమిటీని క్రీడా శాఖ మూడు రోజులకే సస్పెండ్ చేసింది. అప్పట్నుంచి ఈ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను కేంద్రం నియమించిన అడ్‌హక్ కమిటీ పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ సస్పెన్షన్‌కు గురైన డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించారంటూ సాక్షి ఆరోపించింది.