Chhattisgarh Village Electricity : మన దేశానికి స్వాతంత్య్రం 1947లోనే వచ్చినా, ఆ ఊరిలో విద్యుత్ తొలి వెలుగులు మాత్రం 2025లోనే ప్రసరించాయి. ఔను - ఇది నిజమే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి 50 కి.మీ దూరంలోని మారుమూల గ్రామం చిల్కపల్లిలో ఎట్టకేలకు ఇప్పుడు విద్యుత్ పంపిణీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నియాద్ నెల్లనార్ యోజన' అనే పథకం కింద ఈ ఊరిలో విద్యుద్దీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ స్కీం ద్వారా బీజాపూర్ జిల్లాలో విద్యుద్దీకరణను పూర్తి చేసుకున్న ఆరో గ్రామం చిల్కపల్లి. జనవరి 23 నాటికే ఈ ఊరిలో విద్యుత్ పంపిణీ లైన్ల ఏర్పాటు, ఇంటింటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు పూర్తయ్యాయని బీజాపూర్ జిల్లా కలెక్టర్ సంబిత్ మిశ్రా వెల్లడించారు. సుదూరంగా ఉన్న ఈ పల్లెల్లో విద్యుత్ వెలుగులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. రాబోయే కొన్ని నెలల్లో జిల్లాలోని మరిన్ని మారుమూల గ్రామాల్లోనూ విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఇకపై రాత్రి కూడా మా పిల్లలు చదువుకోగలరు!
"ఇప్పటి వరకు మా ఊరు విద్యుత్‌ను చూడలేదు. ఇప్పుడు ఊరిలోని ప్రతీ ఇంట్లో విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం మా జీవితాలను మారుస్తుంది. రాత్రి టైంలో ఇక మా పిల్లలు చదువుకోగలరు. మేం వంటలు కూడా చేయగలం" అని చిల్కపల్లికి చెందిన ఓ గిరిజన మహిళ చెప్పుకొచ్చింది.
ఊరికి వెలుగు
"చాలా దశాబ్దాల తర్వాత మా ఊరిలోకి విద్యుత్ వెలుగులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మేం టీవీ చూడగలం. విద్యుత్‌తో వంట వండగలం. భయం లేకుండా రాత్రిపూట ఊరిలో తిరగగలం" అని చిల్కపల్లికి చెందిన మరో గ్రామస్తుడు తెలిపారు.
నాలుగు నెలలు శ్రమించి విద్యుత్ లైన్ వేశాం: విద్యుత్ ఉద్యోగి
"విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పంపిణీ లైన్లను చిల్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం మాకు పెద్ద సవాల్‌గా మారింది. ఎందుకంటే అక్కడికి ప్రయాణం చేయడమే చాలా పెద్ద కష్టం. రోడ్డు సరిగ్గా ఉండదు. ఏది ఏమైనా మేం శ్రమించి 4 నెలల్లోనే ఆ ఊరిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశాం" అని బీజాపూర్ జిల్లాలోని విద్యుత్ విభాగం ఉద్యోగి ఒకరు తెలిపారు.
గతంలో మావోయిస్టుల ప్రభావంతో సతమతం
కొన్నేళ్ల క్రితం వరకు చిల్కపల్లి గ్రామంపై మావోయిస్టుల ఆధిపత్యం ఉండేది. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు, సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు జరిగిన తర్వాత ఇక్కడి పరిస్థితులు మారాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల వికాసంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే చిల్కపల్లి లాంటి మారుమూల పల్లెలకు విద్యుత్ వసతి, రోడ్డు సౌకర్యం కల్పించేందుకు 'నియాద్ నెల్లనార్ యోజన' పథకాన్ని అమల్లోకి తెచ్చింది.