Rohit Sharma T20 World Cup 2024 :టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (52) అత్యుత్తమ ఫామ్ కనబరిచి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అయితే అర్ధ శతకం బాదిన తర్వాత 10వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అతడికి ఏమైందంటూ కంగారు పడ్డారు. అయితే ఈ విషయంపై రోహిత్ మ్యాచ్ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. భుజం కాస్త నొప్పిగా ఉండటం వల్లనే ముందు జాగ్రత్త చర్యగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగానంటూ చెప్పుకొచ్చాడు.
" భుజం కొంచెం నొప్పిగా అనిపిచింది. అందుకే ముందు జాగ్రత్తగా రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిపోయాను. పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయం నాకు కచ్చితంగా తెలియదు. టాస్ వేసే సమయంలోనూ నేను ఇదే విషయాన్ని చెప్పాను. కొత్త స్టేడియంలో ఐదు నెలల కిందట తయారు చేసిన ఈ పిచ్‌పై ఎలా ఆడాలో కూడా తెలియదు. పిచ్ పరిస్థితులను తెలుసుకోవడం కోసం మేం సెకండ్ బ్యాటింగ్ చేయాలనుకున్నాం. అయితే పిచ్ బౌలర్లకు అనుకూలించింది. క్రీజులో నిలదొక్కుకుంటే ఇక్కడ బాగా పరుగులు సాధించొచ్చు. ఈ మైదానంలో మాత్రం నలుగురు స్పిన్నర్లతో ఆడాలని అస్సు అనుకోవద్దు. మా తుది జట్టు ఎంపిక బ్యాలెన్సింగ్‌గా ఉండాలని మేము అనుకుంటున్నాం. పరిస్థితులు సీమర్లకు అనుకూలంగా ఉంటే ఓ విధంగా, పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని అనుకుంటే మరో విధంగా జట్టు ఎంపిక ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మా వద్ద నలుగురు పేసర్లు, ఆల్ రౌండర్లుగా ఉన్న కూడా మేము ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే తుది జట్టులోకి తీసుకున్నాం. నాణ్యమైన పేస్ దళం ఉన్న పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి మేం రెడీ అవుతున్నాం" అంటూ రోహిత్ శర్మ సమాధానమిచ్చాడు.