Rohith Sharma Reacts on His Fitness : తన ఫిట్‌నెస్‌పై వచ్చే విమర్శల గురించి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త గట్టిగానే స్పందించాడు. తాను 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మార్క్‌ను టచ్ చేయబోతున్నానని, ఫిట్‌నెస్ లేకుండానే ఇన్ని మ్యాచ్‌లు ఆడగలిగానా అని ప్రశ్నించాడు. 17 ఏళ్ల నుంచి ఆడుతూ, 500 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు చేరువ కావడం చిన్న విషయం కాదని పేర్కొన్నాడు.
"17 ఏళ్ల పాటు ఆడటం, 500 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించడం చిన్న విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే ఈ మార్క్‌ను టచ్ చేశారు. ఇంత కాలం పాటు కొనసాగాలంటే జీవన శైలిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. ఫిట్‌నెస్ చూసుకోవాలి, మెదడును నియంత్రణలో ఉంచుకోవాలి, స్వీయ సాధన, ఇలా చాలా చేయాలి. మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యామనేది చాలా ముఖ్యమైనది. ఏదేమైనా మ్యాచ్ కోసం 100 శాతం రెడీగా ఉండి, విజయం సాధించేలా ప్రదర్శన చేయాల్సిందే. దీని వెనక ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కీలక పాత్ర పోషిస్తుంది" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
కాగా, ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకూ కేవలం 10 మంది క్రికెటర్లు మాత్రమే 500 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడారు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. ప్రస్తుతం 485 మ్యాచ్‌లతో రోహిత్ ఆ మైలురాయికి దగ్గరగా ఉన్నాడు.