Srikalahasti Vayu Lingam : శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటిగా, దక్షిణ కాశీ గా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో పరమశివుడువాయులింగంగా మనకు దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయం రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా కూడా పురాణాలలో పేర్కొన్నారు. ఇక్కడి గర్భాలయం 5వ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే వెలుపలి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ రాజులు, విజయనగర రాజులు నిర్మించినట్లుగా తెలుస్తుంది.
స్వయంభువు లింగం
సువర్ణముఖీ నదీ తీరాన వెలసిన శ్రీ కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు స్వయంభువుగా లింగరూపంలో వెలిశాడు. ఇక్కడ వెలసిన అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.
మహా ప్రాణలింగం
శ్రీ కాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్నిప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.వాయులింగంకు ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉండడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
ఆలయ విశేషాలు
అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలి గోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ.
మోక్షాన్ని పొందిన 'శ్రీ', 'కాళ,' 'హస్తి'
ఈ ఆలయంలో శ్రీ అంటే సాలీడు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు శివుని సన్నిధిలో మోక్షాన్ని పొందాయి. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడి స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశంగా పేర్కొంటారు. ఈ ఆలయంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శ్రీ చక్రాన్ని స్థాపించారు.
ఈ క్షేత్రంతో వశిష్టమహామునికి అవినాభావమైన సంబంధం ఉంది. అలాగే ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నమహాభక్తుడు భక్త కన్నప్ప గురించి కూడా తప్పక తెలుసుకోవాలి.
భక్త కన్నప్ప కథ
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుంచి నెత్తురు కార్చేడట. వెంటనే స్వామి రెండవ కంటి నుంచి కూడా నెత్తురు కారడం మొదలైంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.
తారకమంత్రంతో మోక్షం
కాశీ పట్టణంలో మరణించిన వారికి ఎలాగైతే పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడో అలాగే శ్రీ కాళహస్తిలో కూడా పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడని ప్రజల విశ్వాసం. ఈ దేవాలయ ప్రాంగణంలో గల పాతాళ గణపతిని తప్పక దర్శించుకోవాలి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం జ్ఞానప్రసూనాంబ ఆలయం, దక్షిణామూర్తి ఆలయం వంటివి కూడా తప్పక దర్శించుకోవాలి.
ఉత్సవాలు విశేషాలు
శ్రీ కాళహస్తీశ్వర ఆలయం చాలా మహిమాన్వితమైనది. ఇక్కడ ప్రతి నిత్యం స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు సుప్రభాతం వంటి విశేష సేవలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. ఇకమహాశివరాత్రి,కార్తికమాసం వంటి విశేష పర్వ దినంలో ఇక్కడ నిరంతరాయంగా స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు.
రాహుకేతు క్షేత్రంగా
శ్రీ కాళహస్తి ఆలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. అందుకే ఈ క్షేత్రాన్ని రాహుకేతు క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. మన జీవితంలో జాతక దోషాలు వలన కానీ, మన పూర్వీకులు చేసిన తప్పిదాల వల్ల కానీ మనం ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఉదాహరణకు వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగక పోవడం, అనారోగ్యం, జీవితంలో స్థిరత్వం లేకపోవడం, శత్రు బాధలు, రుణ బాధలు వంటివి. అందుకే ఈ క్షేత్రంలో ఒక్కసారి రాహుకేతు పూజలు జరిపించుకున్నట్లైతే సమస్త గ్రహదోషాలు నుంచి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. మన జీవనం సాఫీగా సాగుతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కోసం రాహు కేతు దోష నివారణ పూజలను విశేషంగా జరిపించుకుంటూ ఉంటారు.
నవగ్రహ కవచం
శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ గ్రహణ సమయాల్లో కూడా ఆలయాన్ని మూసివేయరు. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వంటివి ఏర్పడినప్పుడు అన్ని ఆలయాలు మూసివేసి గ్రహణ కాలం తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాతనే ఆలయాలు తెరుస్తారు. కానీ శ్రీ కాళహస్తీశ్వరుడు సాక్షాత్తు నవగ్రహాలనే కవచంగా ధరించిన వాడు కాబట్టి ఇక్కడ గ్రహణ కాలంలో కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అంతేకాదు గ్రహణ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు, కాళహస్తీశ్వర భక్తుడు, మహాకవి శ్రీ ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వరుడు మీద నూరు పద్యాలతో శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించాడు.
ఇలా చేరుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. అందుకే తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు. తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కూడా ఉంటుంది.
కార్తిక మాసంలో వాయులింగ దర్శనం సకల పాపాలను పోగొడుతుంది. మనం కూడా శ్రీ కాళహస్తీశ్వరుని దర్శిద్దాం తరిద్దాం. ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.