Godaguchi Katha : శివునికి భోళా శంకరుడని, భక్తవశంకరుడని బిరుదులు ఉన్నాయి. కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి, అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో తెలియజేసే గొడగూచీ కథను ఈ కథనంలో తెలుసుకుందాం.
శివదేవుని భక్తి తత్పరత
పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్తుడు ఉండేవాడు. అతడు మహా శివ భక్తుడు. ప్రతిరోజూ తమ ఊళ్లో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి తీసుకెళ్లి శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమ నిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి అరగింపు చేసేవాడు.
శివుని ఆరగింపు సేవను కుమార్తెకు అప్పగించిన శివదేవుడు
ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలని నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని పిలిచి, " పాపా! మీ అమ్మా నేను పనిమీద ఊరికి వెళ్తున్నాం. మేము ఊరు నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలి. అదేమిటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను అరగింపు చేసేవాళ్ళం. ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చేయమ్మ! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!" అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది.
శివుని ఆరగింపుకు పాలు పట్టుకెళ్లిన పాప
శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి, చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి, రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ “శివయ్యా! ఇవిగో పాలు నీకోసం తెచ్చాను ఆరగించవయ్యా!" అని శివుడికేసి చూసి చెప్పింది.
శివుని పాలు తాగమని బతిమాలాడిన పాప
పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప "శివయ్యా! పాలు తాగలేదా! నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగవా! తాగు తాగు" అంటూ శివుడి కేసి చూసి పురామయించింది. ఊహు శివుడు తాగలేదు!
పాపను ఆవరించిన దిగులు, చింత
చిన్నపిల్ల కదా! ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మానాన్నలు చెప్పినట్లుగానే చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో! శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు? దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! శివుడి వైపు దీనంగా చూస్తూ 'పాలెందుకు తాగలేదు? తాగవయ్యా! లింగమూర్తి!అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా! రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నవా? నీళ్లు కలిపానని అనుకున్నావా? ఆవుపాలు కాదనుకున్నావా! పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా? అంటూ నిలదీయటం మొదలెట్టింది.
శివుని బుజ్జగించిన పాప
"పరమశివా! పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు. ఒక్క గుటక అన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా! అంటూ పాప పరమశివుడిని బతిమాలుతోంది. నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైన త్రాగవా? మా నాయన కదూ! మా శివయ్య కదూ! తాగవయ్యా!" అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది, ఏడుస్తోంది.
పాప అమాయకత్వానికి ముచ్చట పడిన భోళా శంకరుడు
ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కిందపడి అల్లరి చేస్తూ, గిలాగిలా కొట్టుకోసాగింది. నాన్నగారు పదేపదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం, అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగాని కేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది.
భగవంతుడని తెలియని అమాయకత్వం
శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు, అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయింది. పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతి రోజు పాప పాలు తేవడం శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి.
తిరిగి వచ్చిన శివదేవుడు
ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి అరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మానాన్నలని చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. "ఎక్కడ నుంచి వస్తున్నావు?" అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. 'శివుడు పాలు త్రాగడమేంది? నువ్వు ఏదో అబద్దం చెప్పుతున్నావ్? శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా? నిజం చెప్పు? శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ!' అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నాడు.
పాపతో కలిసి శివాలయానికి వెళ్లిన శివదేవుడు
ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. 'లింగమూర్తి అరగించవయ్యా!' అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది.
శివదేవుని ఆగ్రహం
రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ తాగలేదు? చూడను కూడా లేదు? కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా! ఎంత శివ ద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా! ఉండు నీ పని చెప్తా!" అంటూ ఆక్రోశంతో పాప మీదకి ఉరికాడు ఆ తండ్రి.
శివైక్యం చెందిన పాప
పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తేలిక గట్టిగా ఏడుస్తూ హా!లింగ!హా!లింగ! అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. 'ఇదిగో నేనున్నాను! భయపడకు! అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులో చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. "ఎక్కడికి పోతావే" అంటూ ఇవతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ఆనాటి నుంచి ఆ పాపను “గోడగూచి” అనే పేరుతో స్తుతించసాగారు. ఇదే నిర్మల భక్తికి, అమాయక భక్తికి తార్కాణమైన గోడగూచి కథ. కార్తిక మాసంలో చిన్న పిల్లలకు ఇలాంటి కథలు చెప్పి వారిలో దేవునిపై విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం.
ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.