Rohit Sharma Kuldeep:క్రికెట్లో హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. సీరియస్‌గా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అలాంటి సంఘటనలు నవ్వులు పూయిస్తాయి. విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్ మూడో రోజు ఆటలో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. DRS విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ అందర్నీ నవ్వించింది.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో పేసర్ జస్ర్పీత్ బుమ్రా వేసిన బంతిని స్ట్రైక్‌లో ఉన్న జాక్ క్రాలీ డిఫెన్స్ ఆడబోయాడు. అయితే బంతి అనుకున్న దానికంటే ఎక్కువ స్వింగ్ అయ్యింది. దీంతో బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒక్కసారిగా టీమ్ఇండియా ప్లేయర్లంతా క్యాచౌట్కు అప్పీల్ చేశారు. దీంతో అక్కడే ఉన్న కుల్దీప్ యాదవ్ రీవ్యూ తీసుకోవాల్సిందేనని రోహిత్‌ను కోరాడు. బంతి, బ్యాటును తాకిందంటూ కుల్దీప్ పట్టుపట్టాడు.
నిజంగా తాకిందా అన్నట్లు రోహిత్, కుల్దీప్ వైపు చూశాడు. కానీ, చాకచక్యంగా వ్యవహరించిన కెప్టెన్ రోహిత్ రివ్యూ కోరలేదు. రిప్లైలో కూడా బంతి, బ్యాటును తాకినట్లు లేదు. దీంతో రోహిత్ 'ఇట్స్ ఓకే' అన్నట్లుగా కుల్దీప్ను చూస్తు ఓ నవ్వు నవ్వాడు. అంతే ఈ సన్నివేశం పట్ల అందరూ నవ్వుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'కుల్దీప్ మాట రోహిత్ వినకపోవడమే మంచిదైంది', 'గార్డెన్‌పై కాకుండా ఆట మీద దృష్టి పెట్టమని రోహిత్, కుల్దీప్కు చెబుతున్నాడేమో' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.