RCB VS GT WPL :ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు గెలుపొందింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో బెంగళూరు జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.
కెప్టెన్ స్మృతీ మంధాన (43), సబ్బినేని మేఘన (35*), ఎల్సీ పెర్రీ (23*) రాణించడంతో వల్ల గుజరాత్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత మైదనంలోకి దిగిన ఓపెన్ స్మృతి అద్భుతమైన ఇన్నింగ్స్‌ను అందించింది. ఆ తర్వాత దిగిన సోఫీ డివైన్(6) విఫలమైనప్పటికీ సబ్బినేని మేఘనతో కలిసి స్మృతి గుజరాత్ బౌలర్లను భయపెట్టింది.
అయితే అర్థసెంచరీకి చేరువైన స్మృతి మంధానను తనూజ కాన్వేర్ రిటర్న్ క్యాచ్‌తో బోల్తా కొట్టింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్మృతి ఔటైనప్పటికీ ఎల్లిస్ పెర్రీ(23*) సాయంతో సబ్బినేని మేఘన ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. అలా గుజరాత్ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డెనర్, తనూజ కాన్వేర్‌ల చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టును బెంగళూరు బౌలర్లు హడలెత్తించారు. దయాలన్ హేమలత (31*), హర్లీన్ డియోల్ (22) రెండు డిజిట్ల స్కోర్ సాధించి ఫర్వాలేదనిపించారు. నాలుగో స్థానంలో వచ్చిన వేదా కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్‌నర్ (7)లు మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 7 వికెట్ల నష్టానికి గుజరాత్ 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3, రేణుకా ఠాకూర్‌సింగ్ 2, జార్జియా వారెహమ్ ఒక వికెట్ పడగొట్టారు.