Ravindra Jadeja 300 Wickets :టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్లో 3 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఖలీల్ అహ్మద్ వికెట్ తీయడంతో జడేజా ఈ ఫీట్ అందుకున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 11 మంది క్రికెటర్లు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. టీమ్ఇండియా తరఫున 3వేల రన్స్, 300 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రవీంద్ర జడేజా
2012 డిసెంబర్లో రవీంద్ర జడేజా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి బ్యాటింగ్, బౌలింగ్లో స్థిరంగా రాణిస్తున్నాడు. భారత జట్టును విజయాల్లో అనేకసార్లు జడ్డూ కీలక పాత్ర వహించాడు. ఇప్పటివరకు 74 టెస్టు మ్యాచ్లు ఆడిన జడేజా 300 వికెట్లు, 3వేలకు పైగా పరుగులు చేశాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ 72 టెస్టులోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.
కపిల్ దేవ్
భారత దిగ్గజం కపిల్ దేవ్ టెస్టుల్లో 300 వికెట్లు, 3వేల పరుగుల ఫీట్ 83 మ్యాచ్ ల్లో అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన రెండో భారత బౌలర్గా కపిల్ నిలిచాడు. 1987లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో కపిల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా, కపిల్ తన కెరీర్లో 131 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. అందులో 5,248 పరుగులు చేశాడు. అందులో 8 శతకాలు ఉన్నాయి. అలాగే 434 వికెట్లు పడగొట్టాడు.