Ravi Shastri About Shami Health :తాజాగా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీనీ టీమ్ఇండియా ఓటమితో ముగించింది. ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరిన భారత జట్టు ఆఖరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. స్టార్ ప్లేయర్ల పేలవ ఫామ్, మిడిల్ ఆర్డర్ నిలకడ లేమి, బుమ్రాకు ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం అందకపోవడం వంటి అంశాల వల్ల టీమ్ఇండియా ఈ ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే బుమ్రాకు తోడుగా మహ్మద్ షమీ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అందరూ అనుకున్నారు. కానీ, షమీని ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక చేయలేదు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు షమీ. దీంతో ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు అతడ్ని ఎంపిక చేస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పటికీ షమీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో లేడంటూ బీసీసీఐ మెడికల్ టీమ్ తేల్చి చెప్పింది. దీంతో భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే షమీ గురించి సరైన సమాచారం ఎందుకు బయటకు రావట్లేదంటూ టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఎక్కువ ఎక్స్పీరియెన్స్ ఉన్న అతడ్ని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి ఉంటే భారత జట్టుగా బలంగా ఉండేదని, అతడిని ఆడించాలా? లేదా అనేది తర్వాత నిర్ణయించుంటే సరిపోయేదంటూ అభిప్రాయపడ్డాడు.