Ranji Trophy 2024 Hyderabad Final: 2024 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ప్లేట్ గ్రూప్ ఛాంపియన్‌గా నిలిచింది. మేఘాలయాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మేఘాలయా నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ నాలుగో రోజు తొలి సెషన్లోనే ఛేదించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కే నితీశ్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ప్లేట్ గ్రూప్‌లో ఫైనల్ చేరడం వల్ల హైదరాబాద్- మేఘాలయా జట్లు వచ్చే ఏడాది రంజీలో ఎలైట్ గ్రూప్‌నకు అర్హత సాధించాయి.
వరాల జల్లు:ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుపై హెచ్‌సీఏ (HCA) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ తిలక్‌వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి తలో రూ.50 వేలు స్పెషల్ ప్రైజ్‌మనీ కింద జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
రూ.కోటి, BMW కారు:ఇక వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ ఎలైట్ (Elite) గ్రూప్‌నకు హైదరాబాద్ క్వాలిఫై కావడంపై జగన్‌మోహన్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే 2- 3 ఏళ్లలో హైదరాబాద్ రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ.కోటి ఇస్తామని చెప్పిన జగన్‌మోహన్ రావు, ప్లేయర్లకు అదనంగా ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామన్నారు. జట్టుకు అన్ని విధాలుగా HCA సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.