13 Year Old Cricketer IPL Auction :2025 ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం జరిగింది. 13ఏళ్ల బిహార్ కుర్రాడు వేలంలో భారీ ధర దక్కించుకున్నాడు. రు. 30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఆ పిల్లాడు క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఒకవేళ తుది జట్టులో చోటు దక్కితే ఐపీఎల్లో ఆడనున్న అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు కొడతాడు. ఈ నేపథ్యంలో ఆ చిచ్చర పిడుగు ఎవరా? అని నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు.
బిహార్‌కు చెందిన 13ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన పేరును రూ. 30 లక్షల బేస్ ప్రైజ్‌తో మెగా వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. వేలం షార్ట్ లిస్ట్‌లో తన పేరు కూడా ఎంపికైంది. ఇక తాజా వేలంలో వైభవ్ సూర్యవంశీ మంచి ధర పలికాడు. కనీస ధర రూ.30 లక్షల వద్ద ప్రారంభమైన బిడ్డింగ్‌లో వైభవ్ కోసం రాజస్థాన్, దిల్లీ పోటీపడ్డాయి. చివరికి అతడిని రూ.1.10 కోట్లకు రాజస్థాన్ తీసుకుంది. దీంతో ఐపీఎల్ వేలంలో నిలిచిన, అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డలకెక్కాడు. ఒక్కసారిగా ఈ చిచ్చర పిడుగు పేరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అతడే సూర్యవంశీ
బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 2011లో జన్మించాడు. అంటే ప్రస్తుతం అతడి వయసు 13ఏళ్లు. తాజ్‌పుర్ గ్రామానికి చెందిన వైభవ్ నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. చిన్న వయసులోనే కుమారుడికి క్రికెట్‌పై ఇష్టాన్ని గ్రహించిన వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు. మరో నాలుగేళ్లకే సమస్తిపుర్‌లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు.