Rahul Dravid Job :ఎంతోమంది భారత క్రికెట్ ప్రియుల కలను నెరవేర్చారు టీమ్ఇండియా క్రికెటర్లు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన విజయం సాధించి పలు రికార్డులను తమ ఖాతాలో వేసింది. దీంతో అటు క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా టీమ్ఇండియా హెడ్ కోచ్ ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. ప్లేయర్ల కూర్పు నుంచి మ్యాచ్లో ఆడాల్సిన తీరు వరకూ అన్నింటినీ ఆయన దగ్గరుండి చూసుకున్నారు. తమ జట్టును పతిష్టంగా మలచడంలోనూ ఆయన ఎంతో కృషి చేశారు.
ఇక ప్రపంచకప్ గెలపులో భాగంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుండగా, ఆయన కూడా ఉద్వేగానికి లోనైయ్యారు. ఎప్పుడు నిశబ్దంగా ఉంటూ, తక్కువగా మాట్లాడే ఆయన తొలిసారిగా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు. ఇది చూసి ప్లేయర్లు కూడా ఆయన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆయన హెడ్కోచ్ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇకపై తాను నిరుద్యోగినంటూ చెప్పుకొచ్చారు. తనకు ఏమైన జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
2021లో నవంబర్ హెడ్‌కోచ్‌గా పదవీ బాధ్యతలు చేప్పటిన ద్రవిడ్, అప్పటి నుంచి 2023 వరకూ టీమ్ఇండియాకు సేవలు అందించారు. అయితే అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌తోనే ద్రవిడ్ పదవీకాలం ముగియాల్సింది. కానీ బీసీసీఐ కోరిక మేరకు 2024 టీ20 ప్రపంచకప్ వరకు ఆయన తన బాధ్యతలను కొనసాగించారు. జట్టును విజేతగా నిలిపారు.