Prithvi Shaw Ranji Trophy : టీమ్‌ఇండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాకు మంచి టాలెంట్ ఉందని అందరికీ తెలిసిందే. అయితే చేజేతులా పృథ్వీ షా తన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడని విశ్లేషకులు అంటున్నారు. తనతో కలిసి ఆడిన క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతుంటే 24 ఏళ్ల పృథ్వీ షా మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. సరిగ్గా ఆటపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబయి రంజీ టీమ్ లోకి పృథ్వీ షాను ఎంపిక చేయలేదు.
అవే కారణాలా?
పృథ్వీ షాను పక్కనపెట్టడానికి ముంబయి క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే ఫిట్‌నెస్, క్రమశిక్షణారాహిత్యం వల్లే షాపై వేటు వేసినట్లు సమాచారం. నెట్ సెషన్స్ కు కూడా పృథ్వీ షా ఆలస్యంగా వస్తున్నాడని తెలుస్తోంది. అలాగే కొన్నిసార్లు నెట్ సెషన్స్ డుమ్మా కొడుతున్నాడట. ఒక వేళ పాల్గొన్నా వాటిని సీరియస్గా తీసుకోవట్లేదని సమాచారం.
అంతంతమాత్రంగానే ఫిట్‌నెస్
మరోవైపు పృథ్వీ షా ఫిట్‌నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అధిక బరువుతో అతడు ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ముంబయి క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్లు అతడిపై క్రమశిక్షణాచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పృథ్వీని జట్టు నుంచి తప్పించాలనే నిర్ణయం కేవలం మేనేజ్‌మెంట్, సెలక్టర్లు తీసుకున్నది కాదట. కెప్టెన్, కోచ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది.