Paris Paralympics 2024 Preeti Pal Bronze Medal : పిల్లలు వైకల్యంతో పుడితే ఏ తల్లి దండ్రులకైనా ఎంతో బాధ ఉంటుంది. అందరి పిల్లలా ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపలేకపోతే ఆ బిడ్డతో పాటు, అమ్మ నాన్న పడే వేదన వర్ణణాతీతం. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రీతి పాల్, ఆమె కుటుంబ సభ్యులు ఇదే మనో వేదనను తట్టుకుని నిలబడ్డారు. దీంతో ఇప్పుడు ప్రీతి పాల్ దేశం గర్వించద్దగ స్థాయికి ఎదిగింది. పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని తెచ్చిపెట్టింది.
చిరుతలా పరుగెత్తి! - పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల టీ - 35 100 మీటర్ల పరుగు విభాగంలో పోటీ మొదలైంది. అప్పుడు ఈ బరిలోకి అథ్లెటిక్స్‌లో భారత పతక ఆశలు మోస్తూ ప్రీతి పాల్ దిగింది. గన్ సౌండ్ వినపడగానే చిరుతలా పరుగెత్తింది! అలా ఈ 23 ఏళ్ల ప్రీతి 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానాన్ని అందుకుంది. పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి పతకం అందించింది. పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. ఇక ఇదే ఈవెంట్లో చైనా అథ్లెట్లు జౌ జియా(13.58 సె), గువా కియాంక్వియాన్ (13.74 సె) గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలిచారు.
బలహీనత, వంకర కాళ్లు - ప్రీతి పాల్ బలహీన, వంకర కాళ్లతో జన్మించింది. దీంతో చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆమె కాళ్లలో బలం పెంచి సాధారణ స్థితికి తీసుకురావాలని వైద్యులు చాలానే ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. కొన్నేళ్లు కాలిపర్స్ కూడా ధరించి ప్రయత్నించినా మాములు స్థితికి రాలేకపోయింది.