Disposable Plates : ఒకవైపు కార్తిక మాసోత్సవాలు, వన భోజనాలు వివాహాది శుభకార్యాలు, పడి పూజలు, ప్రభుత్వ కార్యక్రమాలు వెరసి ఎక్కడ చూసినా ఏ విందు ఏర్పాటు చేసినా అక్కడ రంగురంగుల కాగితపు ప్లేట్లే దర్శనమిస్తున్నాయి. అప్పటికప్పుడు తక్కువ ధరల్లో ఈ కంచాలను కొనుగోలు చేయడం పారవేసే సౌలభ్యం ఉండటంతో చాలా మంది వీటినే కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. ఆహార, జీర్ణకోశ, మూత్రపిండాలు, కాలేయ, క్యాన్సర్ వ్యాధులు వచ్చేందుకు వీటి వాడకమే ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే నిత్యం 20 క్వింటాళ్ల పేపర్ ప్లేట్లు, కప్పులు, చెంచాలు, ఇతరత్రా కలర్ పేపర్ ప్లేట్లు వినియోగమవుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు.
నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి ఓ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తుంటారు. వ్యక్తిగతంగా అతనికి మద్యం, ధూమపాన అలవాట్లు లేవు. తప్పని పరిస్థితుల్లో హోటళ్లలో రంగుల కాగితపు ప్లేటులో భోజనం చేసేవారు. అతనికి జీర్ణసంబంధిత సమస్యలు, వికారం, వాంతులు అవుతాయనే భ్రమ, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుండటం వల్ల డాక్టర్‌ను సంప్రదిస్తే అతని కడుపులో ‘బిస్ఫినోల్-ఏ’ అనే రసాయనం చేరి ఈ సమస్యలకు దారితీసినట్లుగా తేలింది. ఇది ఎక్కువగా పేపర్ ప్లేట్లు కలిగిన ప్లేట్లలో వేడిగా ఉన్న ఆహారాన్ని భోజనం చేయడం వల్ల సంభవించిందని వైద్యులు చెప్పడంతో అప్పటి నుంచి స్టీల్ పాత్రను ఇంటి భోజనంతో పాటు తీసుకెళ్తూ అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కాడు.
రంగుకాగితాల కంచాలు ఎక్కువగా ఉపయోగిస్తే : ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ రాపోలు అనిల్‌కుమార్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు వేడివేడిగా కూరలు, సాంబారును రంగు కాగితాల కంచాలపై వినియోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. చాలా మంది ఫుడ్ పాయిజన్ అయిందని ఆందోళన చెందుతుంటారు. ఆహారంలో ప్రమాదకర ఇండస్ట్రీయల్ పేయింట్స్, డై కలర్స్‌తో మిళితమైనటువంటి బిస్ఫినోల్-ఏ అనే శాస్త్రీయ నామం ఉన్న రసాయనం ఉదరకోశంలోకి వెళ్లి గ్యాస్ట్రిక్ సమస్యలను, జీర్ణకోశ వ్యాధులు, కాలేయ, సంతాన లేమి సమస్యలు వంటివి తలెత్తుతున్నాయని ఆయన వివరించారు.
ఇలాంటి రసాయనాలు కడుపులోకి వెళ్లి ‘సింథటిక్’ ఈస్ట్రోజన్‌గా రూపాంతరం చెంది హార్మోన్ల అసమతుల్యతకు కారణమై కొన్ని సార్లు క్యాన్సర్ లాంటి రుగ్మతలుగా రూపాంతరం చెందుతోంది. అన్నీ వనరులు కుదిరితే మన పూర్వీకులు ఉపయోగించే మోదుగు విస్తరాకులు, అరటాకులను కూడా ఉపయోగించడం ఉత్తమమని చెబుతున్నారు.
ఆదర్శంగా స్టీల్ బ్యాంకులు : ఎకనామిక్స్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్‌లోనూ కలర్ పేపర్ ప్లేట్ల వినియోగం వద్దని సూచించింది. గతంలో సిద్దిపేట జిల్లాలో ఔత్సాహిక మహిళా స్వయం సమాఖ్యల చేత ‘స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ఇంట్లో ఏదైనా వేడుకలుంటే వెంటనే ఈ స్టీల్‌బ్యాంకు నిర్వాహకులకు సమాచారమిస్తే కొంత రుసుమును చెల్లించి వినియోగించే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పలు చోట్ల స్టీల్ బ్యాంకులు ఉన్నా సరైన నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
అసలు ఏంటీ బిస్ఫినోల్-ఏ రసాయనం? : కలర్ పేపర్ ప్లేట్లను ఎక్కువగా వినియోగిస్తే దీనిలో ఉండే ‘బిస్ఫినోల్-ఏ’ అనే రసాయనం శరీరంలోకి చేరి దీర్ఘకాలిక వ్యాధులైన కాలేయ క్యాన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, నాడీ మండల వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాగితపు ప్లేట్లను ‘బయో ప్లాస్టిక్’, పెట్రోలియం ప్లాస్టిక్ పూతతో తయారు చేయడం వల్ల వేడి ఆహారం తినే సమయంలో ఈ పూత రసాయనంగా మారి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. పేపర్ ప్లేట్లకు బదులుగా పింగాణీ ప్లేట్లను, సిరామిక్, గాజు పాత్రలు, స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్లు ఉపయోగిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే టోటల్ సెట్!\