Special Story on Old Age Marriages : ఒంటరితనం. అదే ఇద్దరికీ ఉన్న ఒకే ఒక సమస్య. కళ్ల ముందు కన్నబిడ్డలు ఉన్నా, చేతినిండా సంపాదన్న ఉన్నా ఏదో తెలియని వెలితి. మనసుకు సంతోషం కలిగించే తోడు లేని లోటు. అందుకే పదుల వయసులోనూ వారు తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు. అవరోధాలను దాటుకుని జంట ప్రయాణం చేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. పెళ్లి బంధంతో కొత్త అనుబంధాలను పునఃసృష్టంచుకుంటున్నారు.
కాలంతో పాటు వస్తున్న సామాజిక మార్పులకు హైదరాబాద్ వేదికవుతోంది. ఇది వరకు రెండో పెళ్లి, లేదా పెద్దలకు వివాహాలు అంటే వింతగా చూసేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఒంటరితనంతో వారు పడుతున్న ఆవేదనను గుర్తించి తోడును వెతికే పని చేస్తోంది ఇక్కడి పౌర సమాజం. కరోనా కారణంగా అనేక మంది తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల కారణంగా కట్టుకున్న వారు దూరమైన వారు, పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలనే బాధ్యతల్లో మునిగి మరో వివాహం గురించి ఆలోచించని వారు కూడా ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు పెళ్లి వద్దనుకుని ఒంటరిగా మిగిలిపోయిన వారు, వివాహమై భాగస్వామి దూరమై పెద్దలు మనోవేదనకు గురవుతున్నారు.
పెళ్లి చేసుకుంటుంది - ఒకట్రెండు రోజులకే అలా చెప్పి ఇలా వెళ్లిపోతుంది - తీరా చూస్తే?
వివాహాలు చేస్తున్న పిల్లలు : వైద్య సదుపాయాలు పెరిగి జీవిత ప్రమాణం పెరగడంతో ఉద్యోగ విరమణ చేశాక మొదలయ్యే జీవితంలో పాతికేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు. అందుకే ఈ వయసులో కూడా తమకు తోడును ఎవరు వెతుకుతారని వారే పెళ్లిచూపులకు వెళ్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పిల్లలే దగ్గర ఉండి ఒంటరిగా ఉంటున్న వారి తల్లి/ తండ్రికి వివాహం చేస్తున్నారు.
"నా భర్త సినిమా పరిశ్రమలో పని చేసేవారు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు తీసుకున్నాను. మాకో కుమార్తె ఉంది. నేను తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివాను. హిస్టరీలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. నా కుమార్తెకు బెంగళూరులో ఘనంగా వివాహం చేశా. ప్రస్తుతం నా వయసు 57. ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో మెంబర్‌గా చేరాను. అనేక మంది పరిచయం అవుతున్నా, నాకు తగిన వ్యక్తి కోసం ఆశిస్తున్నా." - బొమ్మ అరుణాచౌదరి, హైదరాబాద్
"నేను ఓరియంటర్ ఇన్సూరెన్స్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా చేరి రిటైర్ అయ్యా. కరోనా సమయంలో నా భార్య మరణించింది. అన్ని రకాల సౌకర్యాలున్నా భార్య లేని లోటు కారణంగా ఎప్పుడూ ఒంటరిగానే అనిపిస్తుంది. నా పిల్లలు మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు నా వయసు 62 మంచి తోడు కోసమే స్వయంవరానికి వెళ్తున్నా." - పి.భాస్కర్‌రావు, హైదరాబాద్
3 వేల మందికి తోడు : 'మనసును పంచుకునే వారు లేక ఒంటరిగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుంగుబాటుకు గురై దేశవ్యాప్తంగా ఏటా లక్ష మంది వరకు గుండెపోటుతో మృతి చెందుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను గుర్తించి ఒంటరి వృద్ధులకు తోడు కోసం ప్రతినెలా మూడో ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజ్‌లో పెద్దలకు స్వయంవరం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత ఆరేళ్లలో దాదాపు 3 వేల మంది ఒంటరి పెద్దలు మా వేదికను ఉపయోగించుకున్నారు. మేమే వారికి ఉచితంగా పెళ్లిళ్లు చేస్తున్నాం. అంతకు ముందే లీగల్ అగ్రిమెంట్ చేయిస్తున్నాం. అందులో ఇద్దరికి ఉన్న స్థిర, చరాస్తులు, అప్పులు వాటిలో ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్న వివరాలు కూడా నమోదు చేయిస్తున్నాం.' అని ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషల్ ఫౌండేషన్ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ మందడి కృష్ణారెడ్డి వెల్లడించారు.
ఆడపిల్లలకు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉండదా? - న్యాయ నిపుణుల సమాధానమిదే!