Paris Paralympics 2024 Indian Athlets : టోక్యో ఒలింపిక్స్ కన్నా మెరుగైన ప్రదర్శన చేసి పతక పంట పండిస్తారనుకున్న భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఒక్క స్వర్ణం కూడా రాలేదు. ఇప్పుడా లోటును తీర్చేందుకు పారిస్ పారాలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నారు పారా వీరులు. కచ్చితంగా వీరు పిసిడిని ముద్దాడతారన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వారెవరో తెలుసుకుందాం.
బ్యాడ్మింటన్‌లో -టోక్యో పారాలింపిక్స్ మెన్స్ బ్యాడ్మింటన్ విభాగంలో ప్రమోద్ భగత్, కృష్ణ నగార్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ప్రమోద్ దూరమయ్యాడు. దీంతో మెన్స్ బ్యాడ్మింటన్ విభాగంలో రాజస్థాన్ షట్లర్ కృష్ణ నగార్ మాత్రమే పోటీపడుతున్నాడు. అతడిపైనే పసిడి ఆశలు ఉన్నాయి. సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో పోటీపడనున్నాడతడు. అతడు ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచాడు.
గత పారాలింపిక్స్‌లో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ సిల్వర్ గెలిచారు. ఈ సారి పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో ఉన్నారు. సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఆయన - ఎస్‌ఎల్4 సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ (ఎస్‌ఎల్3-ఎస్‌యూ5)లో పోటీ పడుతున్నారు.
పారాలింపిక్స్‌లో తొలిసారి పోటీ పడనున్నారు మహిళా షట్లర్లు మానసి జోషి, తులసిమతి. వీరు కూడా అద్భుత ప్రదర్శన చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో సాధన కొనసాగించింది మానసి. ఇప్పటివరకు ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఓ గోల్డ్ మెడల్ (2019), రెండు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాండ్ మెడల్స్ సాధించింది. ఇక ఆసియా పారా క్రీడల్లో ఓ గోల్డ్ మెడల్, సిల్వర్, బ్రాంజ్ అందుకుంది తులసిమతి.
జావెలిన్ - పారా జావెలిన్ త్రోయర్, హరియాణా అథ్లెట్ సుమిత్ అంటిల్ ఈ సారి గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు తన పేరిట ఉన్న వరల్డ్ రికార్డును తానే బ్రేక్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. టోక్యో పారాలింపిక్స్ మెన్స్ ఎఫ్64 విభాగంలో అతడు వరల్డ్ రికార్డు 68.55మీతో ఛాంపియన్‌గా ఉన్నాడు. ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. పోటీలో దిగిన ప్రతీసారి గోల్డ్ లేదా ఇతర పతకం సాధిస్తూనే ఉంటాడు.
ఇతడు గత ఏడాది ఆసియా పారా క్రీడల్లో 73.29మీ బల్లెం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ మధ్య ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ వరుసగా రెండో సారి గోల్డ్ మెడల్ సాధించాడు.
ఇక 2016లో గోల్డ్ మెడల్, 2020లో సిల్వర్ గెలిచిన పారా హైజంప్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టోక్యోలో డిస్కస్‌త్రో (ఎఫ్56)లో సిల్వర్ మెడల్ సాధించిన యోగేశ్ కథునియా కూడా ఈ సారి పసిడిని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆర్చరీలో - పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో ఇప్పటివరకు భారత్‌కు ఒక్క గోల్డ్ కూడా రాలేదు. కానీ ఈ సారి 17 ఏళ్ల పారా ఆర్చరీ శీతల్ దేవి తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఈ కశ్మీర్ అమ్మాయికి రెండు చేతులు లేకపోయినా కాలితో విల్లును పట్టి, భుజంతో నారిని లాగి బాణాలు సంధిస్తుంది.