Paris Olympics 2024 Manu Bhaker : ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పతకాల వేటలో అథ్లెట్లు తమ ప్రతిభను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. అలా తాజాగా భారత షూటర్ మను బాకర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత అథ్లెట్‌గా నిలిచింది.
మొదట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఉమెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకుంది మను బాకర్. అనంతరం ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో పతకం సాధించింది. ఈ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్ జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని అందుకుంది. సౌత్ కొరియాతో పోటీ పడి ఈ మెడల్‌ను సంపాదించుకుంది. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరినట్టైంది.
తొలి భారత అథ్లెట్ - అయితే మను బాకర్ కన్నా ముందు సింగిల్ ఎడిషన్‌లోనే రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్. ఈయన 1900 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. అప్పుడు ఇండియాలో బ్రిటీష్ కొలోనియల్ రూల్ ఉండేది. అప్పుడు ఆయన 200మీ, 200మీ హర్డిల్స్‌లో రెండు రజత పతకాలను ముద్దాడారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారట. అయితే ఆయన సాధించిన మెడల్స్‌ను భారత ఖాతాలోనే లెక్కించారట. అలా ఆయన ఒకే ఎడిషన్‌లో రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచారు.