Olympics Hockey India Medals : ఒకప్పుడు ఒలింపిక్స్‌లో తిరుగులేని విజయాలతో చరిత్ర సృష్టించింది భారత హాకీ జట్టు. కానీ ఆ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయి ఆ జట్టుకు మళ్లీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్న భారత హాకీ జట్టు పారిస్ విశ్వ క్రీడల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి మరోసారి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు సాధించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. అలా మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు పూర్వ వైభవాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది.
మోడ్రన్ ఒలింపిక్స్ ప్రారంభమైన తర్వాత 1928 అమ్‌స్టర్‌డమ్ ఒలింపిక్స్‌లో తొలి సారి గోల్డ్ మెడల్ సాధించింది భారత హాకీ జట్టు. ఆ తర్వాత నుంచి తన జైత్ర యాత్రను అలాగే కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్లింది. లాస్ ఏంజెల్స్ (1932), బెర్లిన్ (1936), లండన్ (1948), హీల్ సింకీ (1952), మెల్ బోర్న్ (1956) ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ వరుసగా సాధించి చరిత్ర సృష్టించింది. అనంతరం రోమ్ (1960)లో రజతం, టోక్యోలో (1964) మళ్లీ గోల్డ్ మెడల్‌ను దక్కించుకుంది. మెక్సికో సిటీ (1968), మ్యూనిక్‌లో (1972) కాంస్య పతకంతో సరి పెట్టుకుంది.