Paris Olympics 2024 Indian shooter Swapnil Kusale :మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామానికి చెందిన షూటర్, స్వప్నిల్ కుసాలే(29) పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 2012 నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న కుసాలే, ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసేందుకు ఏకంగా పన్నెండేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
కుసాలే క్వాలిఫికేషన్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో టాప్ 8లో ఉన్న అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఆగస్టు 1న గురువారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో కుసాలే తలపడనున్నాడు. ఈ పోరులో మొదటి మూడు పొజిషన్స్‌లో చోటు దక్కించుకోగలిగితే స్వప్నిల్ కల నెరవేరుతుంది. భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది.
- ధోనీ స్ఫూర్తితో
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి కుసాలే స్ఫూర్తి పొందాడు. రైల్వే టిక్కెట్ కలెక్టర్‌గా ధోనీ కెరీర్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలుసు. అలానే 2015 నుంచి సెంట్రల్ రైల్వేస్‌లో కుసాలే(Ticket Collector Swapnil Kusale) పని చేశాడు. ప్రశాంతత, సహనం క్రికెట్, షూటింగ్‌కు చాలా అవసరమని, ఆ లక్షణాలు ధోనీని చూసి నేర్చుకున్నానని కుసాలే పేర్కొన్నాడు. ‘నేను షూటింగ్ ప్రపంచంలో ఎవరినీ ప్రత్యేకంగా అనుసరించను. నేను ధోనీని ఆరాధిస్తాను. అతను మైదానంలో ఉన్నంత ప్రశాంతంగా, ఓపికగా ఉండటం నా క్రీడకు అవసరం. నేను కూడా అతనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి, అతని స్టోరీకి రిలేట్ అవుతాను.’ అని తెలిపాడు. - ఫైనల్‌కు ఎలా చేరాడంటే?
క్వాలిఫికేషన్ రౌండ్‌లో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన అతని ఇద్దరు ప్రత్యర్థులు జిరి ప్రివ్రత్స్కీ, పీటర్ నింబుర్స్కీ కూడా 590 స్కోర్ చేశారు. అయితే కుసాలే ప్రోన్‌లో 197, స్టాండింగ్‌లో 195, నీలింగ్‌లో 195, మొత్తం 38 ఇన్నర్ 10లతో షాట్ చేశాడు. చెక్ షూటర్ల కన్నా ఎక్కువ ఇన్నర్ షాట్స్ ఉండటంతో ఏడో స్థానంలో నిలిచాడు. జిరి ప్రివ్రత్స్కీ, పీటర్ నింబుర్స్కీ చివరి పొజిషన్ ఎనిమిదిలో నిలిచారు.