Paris Olympics 2024 India:పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు ఆదివారంతో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ విశ్వ క్రీడల్లో భారత్ పోరాటం కూడా ముగిసింది. అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో బరిలో దిగి తమతమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే ఈసారి పతకాల సంఖ్య గతంలో (2020లో 7 పతకాలు) కంటే పెరుగుతుందని భావించగా, భారత్ ఆరింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. అయితే పతకాల సంఖ్య అటుంచితే ఒలింపిక్స్‌లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు. అవేంటంటే?
తూటా దింపిన మను
ఈ ఒలింపిక్స్‌లో షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. తొలుత షూటింగ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ సరబ్‌జ్యోత్‌తో కలిసి కాంస్యం సాధించిన మను స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచింది.
హాకీలో సరికొత్త చరిత్ర
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు ఈ సారి కూడా కాంస్యం అందుకుంది. దీంతో విశ్వక్రీడల్లో హాకీలో భారత్ పతకాల సంఖ్య 13కి చేరింది. భారత జట్టు 52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి. అంతకు ముందు 1968, 1972లో టీమ్‌ఇండియా మూడో స్థానంలో నిలిచింది.
నీరజ్ మళ్లీ
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ సారి రజతం దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా వరుసగా రెండు ఒలింపిక్ ఎడిషన్లలో పతకం సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిలిచాడు. అతని కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఘనత సాధించారు.
ఒకే ఈవెంట్‌లో మూడు పతకాలు
షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకున్నాడు. ఈ విభాగంలో భారత్ పతకం సాధించడం ఇదే తొలిసారి. దీంతో షూటింగ్‌లోనే భారత్ మూడు పతకాలు నెగ్గింది. ఒక ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో మూడు పతకాలు అందుకోవడం ఇదే తొలిసారి.