Pakisthan New Captain :పాకిస్థాన్ జట్టులో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తిరిగి జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అఫీషియల్‌గా ప్రకటించింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి బాబర్ అజామ్‌ను తిరిగి సారథిగా నియమించినట్లు తెలిపింది. దీంతో జూన్‌లో మొదలు కానున్న టీ20 వరల్డ్ కప్‌లో పాక్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే ఫార్మాట్‌కు తనే నాయకత్వం వహించనున్నాడు.
కాగా, రీసెంట్గా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దానికి బాధ్యత వహిస్తూ బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదులుకున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ వైఫల్యంతో బాబర్ స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను కెప్టెన్లుగా ఎంపిక చేశారు. వన్డే ఫార్మాట్‌కు కెప్టెన్ ఎవరనే విషయం మాత్రం తెలుపలేదు.
అయితే షాన్ మసూద్ నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది పాక్. కానీ కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో ఘోరంగా ఓడిపోయింది. ఇక షాహిన్ అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ అక్కడ టీ20 సిరీస్‌లో 4-1తో దారుణంగా ఓడింది. ఇకపోతే షాహిన్ ఆఫ్రిది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో పీసీబీ తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయాలపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి.