Ind vs Pak 2025 :టోర్నమెంట్ ఏదైనా స్పోర్ట్స్ లవర్స్ మాత్రం భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కోసమే ఎదురుచూస్తుంటారు. ఏ ఆటలోనైనా దాయాదులు భారత్- పాకిస్థాన్ తలపడుతున్నాయంటే లక్షలాది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. మరి కొంతమంది ఫోన్లలో వీక్షిస్తుంటారు. అలా ఈ జట్ల మధ్య త్వరలోనే జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రీడా ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ నిరాశే మిగలనుంది! ఆ టోర్నమెంట్లో ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు అయ్యింది. మరి అది ఏ టోర్నీ? రద్దుకు గల కారణాలేంటంటే?
భారత్ వేదికగా జనవరి 13న ఖోఖో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జనవరి 13న దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్‌గా జరగనుంది. ఇక అదే రోజు 13న భారత్- పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ మహిళల జట్టు భారత్‌కు రాలేకపోతోంది. ఈ మేరకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(KKFI) ఓ ప్రకటన విడుదల చేసింది.
తప్పని నిరాశ
2025 ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్‌లో పాకిస్థాన్ పాల్గొనదని కేకేఎఫ్ఐ తాజాగా వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 13న భారత్- పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. కానీ, వీసా సమస్యల కారణంగా పాకిస్థాన్, భారత్‌కు రాలేకపోతోంది.దీంతో తొలి మ్యాచ్‌లో భారత్, నేపాల్ ను ఢీకొట్టనుంది. ఈ మేరకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ఖోఖో ప్రపంచకప్‌నకు 40 జట్లకు బదులు 39 పాల్గొంటున్నాయని అందులో తెలిపింది.
పాకిస్థాన్ దూరం!
'ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని ఆశించాం. కానీ, అలా జరగలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ ప్లేయర్ల వీసా దరఖాస్తు ఆమోదించలేదు. దీంతో దాదాపు వారు ఖోఖో ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే' అని ఖోఖో ప్రపంచ కప్ సీఓఓ గీతా సుడాన్ తెలిపారు.