How to Sleep After Sleepless Night: మనలో కొంతమందికి మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా నిద్రలేమితో ఒత్తిడి, చిరాకు ఆవహించి.. మరుసటి రోజు కూడా ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోతుంటారు. ఈ నేపథ్యంలోనే మధ్య రాత్రి మెలకువ వచ్చినా తిరిగి త్వరగా నిద్రపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ లైటింగ్: కొంతమందికి గదిలోని లైట్లన్నీ ఆర్పేస్తేనే నిద్ర పడుతుంటుంది. మీకూ అలవాటుంటే బెడ్‌రూమ్‌లో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా సులభంగా నిద్ర పడుతుందని.. అలాగే మధ్య రాత్రి మెలకువ వచ్చే అవకాశాలూ తక్కువగా ఉంటాయని అంటున్నారు.
లెక్కపెట్టకండి: ఒకవేళ మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు పదే పదే గడియారంలో సమయం చూసుకోకుండా అలాగే నిద్రపోవాలని అంటున్నారు. ఇలా అస్తమానం సమయం చూసుకుంటూ ఉంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని.. దీంతో వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుందని చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
కాసేపు వేరే ప్రదేశంలో: కొంతమంది నిద్రపోయే ముందు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటివి చేస్తుంటారు. ఒకవేళ మీకు మధ్య రాత్రి మెలకువ వచ్చి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోతే.. వేరే రూమ్‌లోకి వెళ్లి మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్ వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తిరిగి నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ధ్యానంతో మేలు!: ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి మనం ప్రయత్నించే కొన్ని పద్ధతులు కూడా తిరిగి నిద్ర పట్టేందుకు తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకి గట్టిగా శ్వాస పీల్చడం, ధ్యానం, యోగా వంటి ప్రక్రియలు మానసిక ప్రశాంతతను అందించి తిరిగి నిద్రలోకి జారుకునేందుకు సహకరిస్తాయని వివరిస్తున్నారు. అలాగే ప్రతి రోజూ సాయంత్రం ఓ అరగంట వ్యాయామం చేయడమూ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాహారం: రాత్రి తీసుకునే భోజనం కూడా నిద్రకు కీలకమేనని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట తేలిగ్గా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలాకాకుండా కొంతమంది డైటింగ్ పేరుతో ఆహారం తినడం మానేస్తుండాగా.. మరికొందరు మరీ తక్కువగా తీసుకుంటారు. ఇలాంటి వాళ్లకు నిద్ర సరిగ్గా పట్టక మధ్య రాత్రి ఆకలేస్తుంటుందని వివరిస్తున్నారు. దీనివల్ల మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుందని తెలిపారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు చక్కటి పోషకాహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా కాఫీ తాగడం వల్ల కూడ సరిగ్గా నిద్ర పట్టదని 2013లో Sleep Medicine Reviews జర్నల్‌లో ప్రచురితమైన "The Effects of Caffeine on Sleep" అధ్యయనంలో తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కునుకు ఓకే!: కొంతమంది ఇంట్లో ఉండే వారు మధ్యాహ్నం భోజనం చేశాక రెండుమూడు గంటలు హాయిగా నిద్రపోతుంటారు. ఇలా పగలంతా హాయిగా నిద్రపోతే రాత్రి నిద్ర పట్టదని నిపుణులు చెబుుతున్నారు. కాబట్టి పగలు గంటల తరబడి పడుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. అంతగా పడుకోవాలనిపిస్తే ఓ పావు గంట లేదా అరగంట కునుకు తీయడం మంచిదని సలహా ఇస్తున్నారు.
అలాంటి సినిమాలు వద్దు: కొంతమందికి హారర్ సినిమాలు చూడడానికి చాలి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, చూసేటప్పుడు బాగానే ఉన్నా.. మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సినిమాలో ఉన్న కొన్ని భయంకరమైన సీన్స్.. మెలకువ రాగానే గుర్తొస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పడుకునే ముందు ఇలాంటి సినిమాలు చూడకపోవడమే మంచిదని అంటున్నారు. అంతగా చూడాలనిపిస్తే మనసుకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని అందించే సినిమాలు చూడడం ఉత్తమమని సూచిస్తున్నారు.
అయితే మధ్య రాత్రి మెలకువ రావడం, తిరిగి నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎప్పుడో ఒకసారి ఎదురైతే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ తరచూ ఇదే ధోరణి కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా మీ నిద్రలేమికి అసలు కారణమేంటో పరిశీలించి.. దాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్స అందిస్తారని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తలస్నానం చేయగానే జుట్టు దువ్వుతున్నారా? హెల్దీ హెయిర్ కోసం ఈ టిప్స్ పాటించాలట!
మీ కార్ అద్దంపై మరకలా? ఇంట్లోని గ్లాసులు మురికిగా మారాయా? ఈ టిప్స్ పాటిస్తే క్లీన్ అవుతుందట!